Sunday, January 19, 2025

రోజుకు 18 గంటలు పని చేస్తున్నా:సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 24 గంటల్లో 18 గంటలు పని చేస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కార్మికులు, ఉద్యోగులు తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. తమ మంత్రివర్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. తనకు వయస్సు ఉంది, ఓపిక ఉంది, మీ సమస్యలను పరిష్కరించే శక్తి, చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన తెలిపారు. తప్పకుండా తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఆర్టీసికి రూ.281 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం ఆర్టీసి బలోపేతానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసికి రూ.500 కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రెండు నెలల్లోనే 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని సిఎం చెప్పారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసికి ప్రభుత్వ సాయం అందిస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 100 కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.

ఆర్టీసి కార్మికుల పాత్ర మరువలేనిది
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో ఆర్టీసి కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. సకల జనుల సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాను స్తంభింపజేసి రాష్ట్ర సాధన పోరాటానికి సహకరించారన్నారు. తెలంగాణ వస్తే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు భావించారన్నారు. కానీ, 90 రోజులు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. 36 మంది కార్మికులు మరణించినా వారి కుటుంబాల గురించి ఆనాటి ప్రభుత్వం ఆలోచించలేదని సిఎం రేవంత్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్నా మీ కార్మిక సంఘాలు రద్దు చేశారు తప్పా మీ సమస్యలు పరిష్కరించలేదని ఆయన తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడటంలో ఆర్టీసి కార్మికులు ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఆరు గ్యారంటీల్లో మొట్టమొదటి హామీని అమలు చేసిన ఘనత ఆర్టీసి కార్మికులదన్నారు. గత ప్రభుత్వం నియంత మాదిరిగా పాలించి ఆర్టీసి సంఘాలను రద్దు చేసిందని ఆయన గుర్తుచేశారు.

నిజమైన అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి బడ్జెట్ ఇవాళ ప్రవేశ పెట్టామని, రూ.2,75,891 కోట్ల వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టామన్నారు. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ ను రూపొందించామన్నారు. నిజమైన అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టామని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాగితాల్లో చూపించి అబద్దాలు చెప్పదలుచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవిక బడ్జెట్ ను అర్ధం చేసుకోవాలన్నారు.
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసి లాభాల బాటలోకి : డిప్యూటీ సిఎం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్టీసి బలోపేతానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్దలై పనిచేస్తుందన్నారు. ఆర్టీసీ మనది. తెలంగాణ ప్రజలదన్నారు. ఆర్టీసికి గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా నాన్చుడు ధోరణి అవలంభించడం వల్ల ఆర్టీసి నష్టాల్లోకి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసి లాభాల బాటలోకి వెళ్తుందన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసికి కొత్త బస్సులు సమకూర్చాలని వచ్చిన ఆలోచన ఫలితంగా నేడు ఆర్టీసి బలోపేతం అవుతుందన్నారు. ఆర్టీసి సంస్థలో డ్రైవర్లు, కార్మికులు పేద, మధ్యతరగతి వర్గాల వారు.

వీరికి సక్రమంగా జీతాలు రావాలంటే ఆర్టీసి బాగుపడాలి. వారి బాగు కోసం ఆర్టీసి సంస్థను బాగు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో 15 కోట్ల 50 లక్షల మంది మహిళలు ఆర్టీసిలో ఉచి తంగా ప్రయాణం చేశారన్నారు. మహిళలు ప్రయాణం చేసిన జీరో టికెట్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసికి చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా ఆర్టీసిపై కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపడం లేదన్నారు. ఆర్టీసి బస్సుల్లో 70 శాతం పైగా మహిళలు మిగతా పురుషులు ప్రయాణం చేయడం వల్ల నిండుగా కనిపించడమే కాకుండా ఈ సంస్థకు ఆదాయం సమకూరుతుందని, 100 బస్సులు నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆర్టీసిలో జరిగిన సమ్మె చారిత్రాత్మకం
గత దశాబ్ద కాలం పాటు ఆర్టీసి కార్మికులు వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, బిఆర్‌ఎస్ పాలనలో ఆర్టీసి ఉంటుందా? ఎత్తేస్తారా? జీతాలు వస్తాయా? అనేక ఆందోళనలతో కార్మికులు చేపట్టిన సమ్మెను ఉక్కు పాదంతో గత ప్రభుత్వం అణిచివేసిందన్నారు. ఆర్టీసి సంస్థలో స్వేచ్ఛను, మాట్లాడే హక్కును హరించడమే కాకుండా కార్మికుల హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందన్నారు.
ఆర్టీసికి రెండు నెలల్లో రూ.507 కోట్ల నిధులు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసికి రెండు నెలల్లో రూ.507 కోట్ల నిధులు చేకురాయని ఎండి సజ్జనార్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తక్కువ సమయంలోనే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసిందన్నారు. దీంతో 2 నెలల్లో ఆర్టీసికి రూ. 507 కోట్ల నిధులను ప్రభుత్వం అందించిందన్నారు. గతంలో కరోనా, డీజిల్ ధరలు, కార్మికుల సమ్మెతో ఆర్టీసికి తీవ్ర నష్టాలు వచ్చాయన్నారు. కానీ, తాము బాధ్యతలు తీసుకున్నాక పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దీంతో ఆర్టీసిలో కొద్దికొద్దిగా నష్టాలు తగ్గుతున్నాయని, త్వరలో 675 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని, అలాగే ప్రభుత్వం సహకారం అందిస్తే మరో 1000 బస్సులను కొనుగోలు చేస్తామని ఎండి సజ్జనార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News