Saturday, January 11, 2025

కాంగ్రెస్, బిఆర్ఎస్ జలయుద్ధం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఛలో నల్గొండ… కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ టూర్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ప్రాజెక్టుల వ్యవహారం

కృష్ణా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడం వల్ల తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు వాటిల్లే నష్టాన్ని
నల్గొండ సభలో ప్రజలకు వివరించనున్న బిఆర్‌ఎస్

బిఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో జరిగిన అవకతవకలను మేడిగడ్డ బ్యారేజీ వేదికగా ప్రజలకు వివరించేందుకు సర్కార్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కెఆర్‌ఎంబి)కి అప్పగించడాన్ని నిరసిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో బిఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా, ఆ సభకు కౌంటర్‌గా ప్రభుత్వం అన్ని పార్టీల ఎంఎల్‌ఎలను మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్లనుంది. ఎంఎల్‌ఎలను మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకి తీసుకెళ్లి, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను నిపుణుల ద్వారా వివరించేందుకు సర్కార్ సిద్దమైంది. మేడిగడ్డ పర్యటనకు సిఎం రేవంత్ రెడ్డి
సహా మంత్రులు కూడా హాజరుకానున్నారు.

ఛలో నల్గొండ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఆర్‌ఎస్
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకించామని, కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణ నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించిందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. అయితే తాము ప్రాజెక్టులను అప్పగించలేదని, అప్పగించబోమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయినా, కెఆర్‌ఎంబి అంశంపై ఆందోళనకు సిద్ధమైన బిఆర్‌ఎస్ ఈనెల 13న నల్లగొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీ హోదాలో బిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించనున్న తొలి సభ నల్గొండ బహిరంగ సభ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఆ సభకు బిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నల్గొండ సభకు సుమారు 2 లక్షల మంది జన సమీకరణ చేయడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉద్ధృతం చేద్దామని గులాబీ బాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం కోసం గతంలో నిర్వహించిన సభలను తలపించేలా నల్లగొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయంతం చేసేందుకు మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, ముఖ్య నాయకులు సన్నద్ధమవుతున్నారు.లోక్‌సభ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభను బిఆర్‌ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారా నల్లగొండ వేదికగా బిఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి తెర లేపనున్నది.

మేడిగడ్డ కుంగుబాటును ఎంఎల్‌ఎలకు వివరించనున్న ప్రభుత్వం
అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఈనెల 13న మేడిగడ్డ బ్యారేజీకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. బిఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన బ్యారేజీ కుంగుబాటును ఇంజినీరింగ్ నిపుణుల ద్వారా ఎంఎల్‌ఎలకు ప్రత్యక్షంగా వివరించనున్నారు. కుంగిన చోట కొత్తగా నిర్మించేందుకు సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు వేశారు. కెసిఆర్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో జరిగిన అవకతవకలను మేడిగడ్డ బ్యారేజీ వేదికగా ప్రజలకు వివరించేందుకు సిఎం రేవంత్ సిద్ధమయ్యారు. మేడిగడ్డ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడి తమ పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిబాటుపై విజిలెన్స్ విచారణలో ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామని, జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని, జ్యూడీషియల్ విచారణ తర్వాతనే ఈ విషయంపై ముందుకెళతామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు వెళ్దామని ఎంఎల్‌ఎలందరినీ ఆహ్వానించానని, తమ ఎంఎల్‌ఎలనే కాదు, ప్రతిపక్షాలనూ మేడిగడ్డకు తీసుకెళతామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 13వ తేదీన బిఆర్‌ఎస్ వాళ్లకు సభ ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకరోజు ముందు లేదా వెనుక వెళదామని చెప్పినా, అందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్ కట్టిందే తాము అయినప్పుడు చూడాల్సింది తాము కాదు, కాంగ్రెస్ పార్టీనే అని కెటిఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఇప్పుడు తెలంగాణ దేశానికి ధాన్యాదారంగా నిలుస్తున్నదని, దేశానికి అన్నపూర్ణగా మారిందని వ్యాఖ్యానించారు. కాబట్టి కాలేశ్వరం ప్రాజెక్టు విజయం గురించి తమకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలని, అందుకు ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉందని చెప్పారు. మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News