Monday, December 23, 2024

సభలో ఎండగడదాం

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం
ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిన సిఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇరిగేషన్ శాఖలో నెలకొన్న అవినీతిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష
తక్కువ వ్యయంతో పూర్తి చేసి, ఎక్కువ ఆయకట్టును సృష్టించే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సిఎం హామీ

మనతెలంగాణ/హైదరాబాద్ :  కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం ప్రజాభవన్‌లో ఆదివారం సాయంత్ర జరిగింది. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించగా ముగ్గురు, నలుగురు మంత్రులు గైర్హాజరు కాగా, 38 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయినట్టుగా సమాచారం. నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అక్రమాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సీఎల్పీ సమావేశంలో నీటిపారుదల శాఖలో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. నేడు అసెంబ్లీలో ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
నేడు అసెంబ్లీ ఎవరు ఏమీ మాట్లాడాలి?
నేడు అసెంబ్లీలో ఏ అంశంపై ఎవరు ఏం అంశంపై మాట్లాడాలన్న దానిపై ఈ సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. ప్రాజెక్టుల వివాదాల గురించి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు సిఎం రేవంత్‌తో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు పూర్తిస్థాయిలో వివరించినట్టుగా తెలిసింది. మంగళవారం మేడిగడ్డలో క్షేత్రస్థాయిలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాంపై సైతం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం. సాగునీటి విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ప్రాజెక్టులకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. ఈ రెండు నెలల్లో పాలనాపరంగా చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నిర్వీర్యమైనట్లు చెబుతున్న వ్యవస్థలను చక్కబెట్టేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలియచేసినట్టుగా సమాచారం.
కృష్ణా, గోదావరిలో నీటి వాటాను సాధించేందుకు…
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వాటి పురోగతి, వాటికైన వ్యయం, సాగులోకి వచ్చిన విస్తీర్ణం తదితర అంశాలపై సిఎం రేవంత్, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించినట్టుగా తెలిసింది. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు, అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని వివరించడంతో పాటు కృష్ణా, గోదావరిలో నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం వారితో స్పష్టం చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ముందుగా ప్రకటించినట్లుగా తక్కువ వ్యయంతో పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టును సృష్టించే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని సిఎం రేవంత్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హామీనిచ్చినట్టుగా తెలిసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎలిమినేటి మాధవరెడ్డి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు ఎల్‌ఐఎస్, రాజీవ్ భీమా ఎల్‌ఐఎస్, కోయిల్ సాగర్ ఎల్‌ఐఎస్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు- ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జె.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ స్కీమ్ కొమురం భీం, చిన్న కాళేశ్వరం వంటి ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఉత్తమ్ తెలియచేసినట్టుగా సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News