మన తెలంగాణ / హైదరాబాద్ : జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాటారం మండలంలోని మహదేవ్ పూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ళు వన్యప్రాణులను వేటాడం కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఎ. ప్రవీణ్ కుమార్ మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు సమర్పించాలని చీఫ్ వైల్డ్ వార్డెన్ ఎమ్.సి. పర్గైన్‌ను మంత్రి ఆదేశించారు. అడవి జంతువులను వేటాడేందుకు వేటగాళ్ళు విద్యుత్ తీగలు అమర్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను సేకరించి గ్రేహౌండ్స్‌తో పాటు స్థానిక పోలీసు అధికారులకు అందించాలని మంత్రి సూచించారు. తద్వారా వారు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. వన్యప్రాణులను వేటాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అటవీ అధికారులను ఆదేశించారు.