Monday, January 20, 2025

డార్వినిజం అవసరం

- Advertisement -
- Advertisement -

అనంతమైన ఈ విశ్వంలో జీవుల ఆవిర్భావం ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలినది. ఆ సమయంలో అనేక మంది శాస్త్రవేత్తలు పలు రకాల ఆలోచనలను వెలిబుచ్చారు. కానీ అవి శాస్త్రీయతకు నిలబడలేకపోయాయి. ఈ క్రమంలో జీవుల పుట్టుకపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన గొప్ప సిద్ధాంతం చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం. ఇది జీవుల పుట్టుక పూర్వోత్తరాలను ఛేదించడంలో అగ్రభాగాన నిలబడింది. భూమిపై జీవజాలం ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది. విజ్ఞాన శాస్త్రంలో దీన్ని ఒక మౌలికమైన భావనగా భావిస్తారు. చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లాండ్‌కు చెందిన ఒక గొప్ప ప్రకృతి వాదిగా పేరు పొందాడు. ఆయన 1809 ఫిబ్రవరి 12 ఇంగ్లాండులో జన్మించాడు. ఆయన జన్మదినాన్ని ప్రతి ఏటా డార్విన్ డే గా జరుపుకుంటారు.

పారిశ్రామిక విప్లవ కాలంలో చార్లెస్ డార్విన్ కన్నా ముందు జీవశాస్త్రంలో అనేక నూతన ఆవిష్కరణలు జరిగినాయి. అయినప్పటికీ జీవుల పుట్టుక, పరిణామంపై సమగ్రమైన వివరణ ఇవ్వడంలో సఫలం కాలేకపోయారు. తదుపరి వచ్చిన చార్లెస్ సిద్ధాంతాలు మనిషి కోతి నుంచి వచ్చాడని, మనిషిని దేవుడు సృష్టించలేడనే ఆలోచన తెరమీదికి తేచ్చాడు. ఇది శాస్త్ర ప్రపంచంలో తీవ్రమైన వాదోపవాదాలకు దారితీసింది. సామాజికంగా, మతపరంగా విపరీతమైన వివాదానికి కూడా దారితీసిందని చెప్పవచ్చు. డార్విన్ సిద్ధాంతం అనేక పరిశోధన, పరికల్పనలతో రూపుదిద్దుకున్నది. ఊహాత్మకమైన సిద్ధాంతం కాదు. బిగీల్ అనే నౌకలో డార్విన్ ప్రకృతి పరిశీలన నిమిత్తం ప్రపంచ యాత్ర చేసి జీవుల భిన్న లక్షణాలపై సమగ్రమైన వివరణ ఇచ్చారు. ఈ భూమి మీద మానవునితో సహా ఇప్పుడున్న జీవజాతులు యథాతథంగా సృష్టించబడ్డాయన్న వాదనను సవాలు చేశాడు. దీనికి చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిష్కారం చూపాడు.

అయితే ఆనాడు జీవులు జీవపరిణామం ద్వారా ఆవిర్భవించాయనే భావనను సాంప్రదాయవాదులు తిరస్కరించేవారు. కానీ డార్విన్ జాతుల ఆవిర్భావం (origin of species) అనే గ్రంథంలో పరిణామాల ద్వారా జీవులు ఆవిర్భవిస్తాయని చెప్పారు. జీవ పరిణామానికి ప్రకృతి వరణం(natural selection) కారణమని తిరుగులేని విధంగా నిరూపించాడు.జీవులలో భిన్నత్వం ఉంటుందని, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా భిన్నత్వం ఉంటుందని పేర్కొనడం జరిగింది. సృష్టిలోని పర్యావరణ పరిస్థితులకు అనుకూలమైన లక్షణాలు గల జీవులు బతుకుతాయి. ఆ లక్షణాలను తమ సంతతికి కూడా ఇస్తాయని తన ‘ప్రకృతి వరణం’ అనే సిద్ధాంతంలో పేర్కొన్నాడు. అనగా మనుగడ కోసం జరిగే పోరాటంలో ప్రకృతికి తట్టుకోగల జీవులు బతుకుతాయని మిగిలినవన్నీ నశిస్తాయనే సూత్రాన్ని ఆయన చెప్పాడు. డార్విన్ చెప్పిన ‘ఉత్తమ జీవులు మనుగడ’ అనే సూత్రాన్ని పెట్టుబడిదారి పోటీ ప్రపంచంలో ఆనాడు దోపిడీని, వలస దోపిడీని సమర్థించుకోవడానికి అనేక మంది ఉపయోగించుకున్నారు.

19వ శతాబ్దంలో తెల్లజాతీయులు ప్రపంచ దేశాలకు వలస వెళ్లి ఆధిపత్యం చేయడానికి డార్విన్ సూత్రాన్ని అర్థం చేసుకొని బలహీన దేశాలను దోపిడీ చేయడం మొదలుపెట్టారు.ఆనాటి మత గ్రంథాలు, సాంప్రదాయవాదులు చార్లెస్ డార్విన్ వాదనను ఎంతగా వ్యతిరేకించినా డార్విన్ ‘పరిణామ వాదం’ జీవులను అవగాహన చేసుకోవడంలో ఎంతో దోహదపడింది. మరోవైపు అనేక మంది యువకులు జీవ శాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకొని ఆ దిశలో పరిశోధనలు ప్రారంభించడానికి డార్విన్ ‘నేచురల్ సెలక్షన్’ గ్రంథం స్ఫూర్తినిచ్చింది. అదే విధంగా ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం జీవుల పుట్టుక , పరిణామంపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను విభేదించడంలో కీలక పాత్ర పోషిస్తూ శాస్త్రీయ ఆలోచనలకు పునాది వేసింది. కానీ భారత దేశంలో కొంత కాలంగా భారతీయ మేధావి, పాలకవర్గం పలు వేదికల దగ్గర భారతీయ శాస్త్ర విజ్ఞానంతో పాటు ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికి వక్రభాష్యం పలకడం మొదలు పెట్టింది. గతంలో జరిగిన జలంధర్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రముఖ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉన్న నాగేశ్వరరావు చార్లెస్ డార్విన్ సిద్ధాంతం

మన పురాణాల్లోని దశావతారంలో ‘మత్స్యావతారం’ గా పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా వున్న సత్యపాల్ సింగ్ డార్విన్ సిద్ధాంతం తప్పని విద్యావ్యవస్థలో డార్విన్ సిద్ధాంతాన్ని సైన్స్ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించాలన్నారు. ఇలాంటి అసత్య, సూడో సైన్స్‌వాదనలు ప్రపంచ శాస్త్ర వారసత్వానికి అపహాస్యం చేయడమే. మన శాస్త్ర ప్రగతి ఎటు పోతుందో అనే అనుమానం వ్యక్తం అవుతుంది. మరోవైపు ఇటీవల నూతన విద్యా విధానానికి అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ ప్రారంభించింది.ఇటీవల ఎన్‌సిఇఆర్‌టి (NCERT) పదవ తరగతి సిలబస్ నుంచి డార్విన్ జీవపరిణామాల క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాల తొలగించడం వివాదంగా మారింది. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ 1800 మందికి పైగా శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు ప్రభుత్వానికి బహిరంగ లేఖలు రాశారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడానికి డార్విన్ సిద్ధాంతం సెకండరీ స్థాయి పుస్తకాల్లో ఉంచాలని శాస్త్రవేత్తలు కోరారు. డార్విన్ పరిణామ క్రమాన్ని

తొలగిస్తే భావి మస్థిష్కాకాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏమి చెప్పాలనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి సైతం దైవత్వాన్ని ముడి పెడతారేమోనని అనుమానం పలువురులో రేకెత్తుంది. ప్రకృతికి, జీవుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రీయంగా సైద్ధాంతికంగా నిరూపించి, మానవ సమాజానికి అనువర్తనం చేసిన గొప్ప శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన సిద్ధాంతం నేటికీ ఆచరణీయమని చెప్పవచ్చు. దాన్ని విద్యార్థుల పాఠ్యాంశంలో భాగం చేసి విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. నేటి సాంకేతిక యుగంలో భారత్ సుడో సైన్స్ వాదనల నుంచి బయటపడాలి. శాస్త్ర ప్రగతిని, సైంటిస్ట్‌ల సేవలను గుర్తించి, భావితరాలకు అందించాలి. ప్రశ్నించే తత్వంతో కూడిన పౌర సమాజానికి పునాది వేయాలి. అప్పుడే భారతదేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News