Thursday, October 24, 2024

వాటర్ వార్

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదు

68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసింది
కెసిఆర్ పాపాలభైరవుడు

పదేళ్లు జరిగిన పాపాలకు ఆయనే కారణం

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు కృష్ణా నీళ్లు ప్రాణప్రదాయం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు కృష్ణాపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి ప్రధాన అంశంపై చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ సిఎం కెసిఆర్ సభలో రాకుండా ఫామ్‌హౌస్‌లో దాక్కున్నారని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. మహానుభావుడు ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని, జలాల్లో 68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసిందని తెలిపారు. ఈ తీర్మానానికి అనుకూలమో, వ్యతిరేకమో విపక్ష నేతలు స్పష్టత ఇవ్వాలని అడిగారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతుంటే కెసిఆర్ ముఖం చాటేశారని అన్నారు. పదేళ్లు జరిగిన పాపాలకు కెసిఆరే కారణమని, ఆయన పాపాలభైరవుడు అని సిఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.కృష్ణా జలాల్లో నీటి వాటాను ఎవరు అమ్ముకున్నారు..?, ఎవరు చేపల పులుసుకు అలుసిచ్చారు..? అని నిలదీశారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ను సభకు రమ్మని చెప్పండి అని స్పీకర్‌ను కోరారు. కెసిఆర్ సభకు వస్తే ఆయనకు ఎంత సమయం మాట్లాడతానంటే అంతసేపు మైక్ ఇస్తామని,ఆయన సభలోకి వస్తే ఎంతసేపైనా చర్చకు సిద్ధమని చెప్పారు. బిఆర్‌ఎస్ యజమాని కెసిఆర్ రాకుండా మిగతా సభ్యులు మాట్లాడే మాటలకు విలువ లేదని అన్నారు. కెసిఆర్ మాట్లాడితే తాము కూడా సమాధానం చెబుతామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
హరీశ్‌రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారు : సిఎం
అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు జిల్లాలో నీళ్లు లేకుండా బతుకుదెరువు కోసం వలసవెళ్లారని చెప్పారు. కరీంనగర్ ప్రజలు తరిమికొడితే కెసిఆర్ పాలమూరు వలస వచ్చారని ఏద్దేవా చేశారు. తెలంగాణ సమాజానికి నీళ్లు ప్రాణప్రదాయిని అని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం వరకు కృష్ణా నది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 10 లక్షలకు పైగా మంది వలసలు వెళ్లి తట్టపని, పారపని, మట్టిపని, బొగ్గుపనుల కోసం వలసలు వెళ్లారని, ఇందుకు కారణం ఒక వ్యక్తి అని కెసిఆర్‌ను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68 శాతం వాటా నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని ఒక ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చినప్పుడు హూందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్ధతు పలికి.. తెలంగాణ హక్కుల మీద, నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డామని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సమయం, సందర్భంలో సభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో దాక్కొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మిగతావారిని పంపించి పచ్చి అబద్దాలు ఆడిపిస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందని విమర్శించారు. రేవంత్‌రెడ్డిని కొడంగల్ ప్రజలు తరిమితే మల్కాజిగిరి వచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టుల అప్పగింతపై కెసిఆర్ మాట్లాడిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నిద్రలేచి ఈ తీర్మానం ప్రవేశపెట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ గురించి కొందరు వ్యక్తిగతంగా తూలనాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు..కెసిఆర్ లేకుంటే రేవంత్‌రెడ్డి సిఎం అయ్యేవారే కాదు అని పేర్కొన్నారు. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడుతున్న భాష చూసి కొంతమంది మేధావులు తమకు ఫోన్ చేసి అడుగుతున్నారని చెప్పారు. ఇది గాంధీభవన్ కాదని శాసనసభ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, సిఎం మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. “ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు కెసిఆర్ కూర్చీ ఖాళీగా ఉంది. ఈ రోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మారావు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తే వారన్న నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావుకు బాధ్యతలు ఇవ్వాలి. పద్మాగారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం కొట్లాడేవారు. వారి లాంటివాళ్లను పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. మొత్తంగా కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రశక్తే లేదు. తెలంగాణ వాటా నీళ్లు రాష్ట్రానికి ఇవ్వాల్సిందే” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
బిఆర్‌ఎస్ ఏజెంట్లపై త్వరలోనే చర్యలు : డిప్యూటీ సిఎం భట్టి
రాష్ట్ర ప్రభుత్వంలో బిఆర్‌ఎస్ ఏజెంట్లు చాలామంది ఉన్నారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అలాంటి వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇఎన్‌సి మురళీధర్‌రావు రిటైర్ అయినా పదేళ్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొనసాగించారని, ఆయనతో అనుకూలంగా మాట్లాడించిన వీడియోను హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రదర్శించారని మండిపడ్డారు. సభను, రాష్ట్రాన్ని హరీశ్ తప్పుదోవ పట్టించకూడరని చెప్పారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదామంటే ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ సభకు రాలేదని విమర్శించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి మంగళవారం నల్గొండ సభకు వెళ్తారా..? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News