ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని… మరి ప్రాజెక్టుల పేరుతో పేకమేడలు కట్టారా అని ముఖ్యమంత్రి రవేంత్ రెడ్డి ప్రశ్నించారు. కుంగిన ప్రాజెక్టును ఎవరూ చూడకుండా పోలీసు పహారా పెట్టారని మండిపడ్డారు. శాసనసభ సభ్యులందరూ మేడిగడ్డకు రావాలని కోరుతున్నానని.. అసలు అక్కడేం జరిగిందో.. నిజాలేంటో ప్రజలు తెలియాలన్నారు.
అసెంబ్లీలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలని మన పెద్దలు చెప్పారు. ప్రాజెక్టుల వల్లే కరువు ప్రాంతాల్లోనూ పంటలు పండించే అవకాశం వచ్చిందని చెప్పారు. కృష్ణా జలాలపై వాస్తవాలను సభ ద్వారా ప్రజలకు చెప్పామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఆనాడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెకట్టును మరో చోట కట్టిందని… మొదట రూ.35వేల కోట్ల అంచనాలతో ప్రారంభించి.. తర్వాత దానిని రూ.లక్ష 47వేల కోట్లకు పెంచారని చెప్పారు. రీ డిజైన్ పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను నిర్మించారని… అంతఖర్చు చేసి కట్టిన మూడేళ్లేకే ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. బ్యారేజ్ భద్రతపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఇస్తే బిఆర్ఎస్ విమర్శించిందన్నారు. మీరు చెప్పిన ప్రపంచ అద్భుతాన్ని మేమూ చూస్తాం రండి.. కెసిఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నా.. మీ సభ్యులను పంపించండి.. కెసిఆర్ వస్తేనంటే ప్రత్యేక హెలికాప్టర్ కూడా సిద్ధం చేస్తామని సిఎం రేవంత్ అన్నారు.