Saturday, December 21, 2024

ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు!

- Advertisement -
- Advertisement -

సీట్ల పొత్తులో ఆప్ బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపకాలపై ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం కనపడుతోంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలలో కేవలం ఒక్కంటే ఒక్క స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తామని ఆప్ తెగేసి చెప్పింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. అయితే ఆప్ ఎంపి సందీప్ పాఠక్ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు సాధ్యమయ్యేనా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రతిభ ప్రాతిపదికన చూస్తే కాంట్రెస్‌కు ఢిల్లీలో ఒక్క సీటును కూడా పొందే అర్హత లేదు. కాని పొత్తు ధర్మాన్ని దృష్టిళో పెట్టుకుని ఆ పార్టీకి ఢిల్లీలో ఒక సీటు ఇస్తాం.

కాంగ్రెస్ పార్టీ ఒక సీటులో, ఆప్ ఆరు సీట్లలో పోటీ చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము అంటూ పాఠక్ వ్యాఖ్యానించారు. కాగా..గతంలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను ఆప్ కైవసం చేసుకోవడంతో పొత్తు చర్చల్లో ఆప్‌దే పైచేయిగా ఉంది. అయితే దేశ రాజధానిలో వరుస అపజయాలను చవిచూసిన కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తోంది. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీలో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం 250 స్థానాలలో 9 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇలా ఉండగా. లోక్‌సభ ఎన్నికకు సంబంధించిన .సీట్ల పొత్తుపై జరిగిన ప్రాథమిక చర్చలలో 4:3 సూత్రాన్ని కాంగ్రెస్ ప్రతిపాదించింది. కాంగ్రెస్ 4 స్థానాలలో, ఆప్ 3 స్థానాలలో పోటీ చేయాలని కాంగెస్ ప్రతిపాదిచింది.

అయితే పాఠక్ ప్రకటన ప్రకారం ఉభయ పక్షాలకు సంతృప్తిని కలిగించే ఏకాభిప్రాయం కుదరలేదన్న సూచనలు కనపడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను బిజెపి కైవసం చేసుకోగా కాంగ్రెస్, ఆప్‌లకు మొండి చెయ్యి మిగిలింది. ఇండియా కూటమిలోని మిత్ర పక్షాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆప్ నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలలో తామే పోటీ చేస్తామని అధికార ఆప్ ప్రకటించడంతో కాంగ్రెస్ కూడా ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు ఉండగా చండీగఢ్‌లో ఒక స్థానం ఉంది. మొత్తం కలిపితే 14 స్థానాలు అవుతాయి.

ఈ 14 స్థానాలకు ఆప్ తన అభ్యర్థులను ప్రకటిస్తుందని, ఈ 14 స్థానాలలో ఆప్ అభ్యర్థులు గెలుపొందే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని గత శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ర్యాలీలో పిలుపునిచ్చారు. హర్యానా, గోవా వంటి రాష్ట్రాలలో కూడా తమకు సీట్లు కేటాయించాలని ఆప్ డిమాండు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల పొత్తు చర్చలు జఠిలమవుతున్నాయి. తన విజయావకాశాలను నీరుగార్చుకోవడం ఇష్టం లేని కాంగ్రెస్ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News