Monday, December 23, 2024

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరుపాలి

- Advertisement -
- Advertisement -

సిఎంకు ఆర్.కృష్ణయ్య లేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎస్‌సి, ఎస్‌టి, బిసి గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల గత కొంత కాలంగా గురుకుల పాఠశాలల్లో 65 మంది బాల, బాలికలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురుకులాల్లో పాలన పూర్తిగా దెబ్బతిందని, పిల్లలకు నాసిరకం ఆహారం పెడుతున్నారని, అవినీతి పెరిగి పోయిందని ఆరోపించారు. ఒక్కో గురుకుల పాఠశాలలో 1000 నుంచి 2000 మంది విద్యార్థులు కిక్కిరిసి ఉన్నారురని దీని మూలంగా విద్యార్థుల చదువు, ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాములు కరిచి కొందరు చనిపోయారని, ఆరోగ్యం దెబ్బతిని కొందరు చనిపోయారని, భువనగిరిలో అమ్మాయిని కొందరు చంపి దానిని కప్పిపుచ్చడానికి తల్లిదండ్రుల మీద, బిసి సంఘ నాయకుల మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని కృష్ణయ్య ఆరోపించారు.

ఎంతో గొప్ప ఆశయంతో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు 1982-83 లో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన ఫలితంగా నాణ్యమైన విద్య కోసం గురుకుల పాఠశాలల పథకాన్ని పెట్టించామన్నారు. ఇన్ని సంవత్సరాలుగా సజావుగా నడిచాయని, కానీ ఇటీవల కొందరు అధికారులు 10 సంవత్సరాలుగా ట్రాన్స్ పర్లు లేక పాతుకుపోయి నిర్లక్ష్యం చేస్తున్నారని దీని వల్ల మొత్తం వ్యవస్థ చెడిపోయిందన్నారు. కీసరలోని బిసి గురుకుల పాఠశాలలో తరచూ విషపురుగులు సంచరిస్తున్నాయని, యాచారం గురుకుల పాఠశాలలో బాత్‌రూములు లేక పాఠశాల పక్కన గల చెరువులోకి వెళ్లి కాలకుత్యాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. భూపాలపల్లి జిల్లా బిసి గురుకుల బాలుర పాఠశాలలో తాగేందుకు మంచినీళ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, కాగజ్ నగర్ గురుకుల బాలికల పాఠశాలలో తలనొప్పికి జండుబాం రాసుకోమన్నారని, దీంతో సమయానికి టాబ్లెట్స్ ఇవ్వకపోవడంతో ఐశ్వర్య అనే అమ్మాయి చనిపోయిందని ఆయన పేర్కొన్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 83 మంది ఆసుపత్రిపాలయ్యారని, ఆసిఫాబాద్ జిల్లా గురుకుల పాఠశాలలో 15 రోజుల్లో అనారోగ్యం కారణంగా గురుకుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా 5 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన తెలిపారు. బాటసింగారం బిసి గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలుడు అనుమానస్పదంగా వృత్తి చెందాడని, షాద్‌నగర్ గురుకుల పాఠశాలలో బాలుర వసతి గృహంలో ఎలుకలు కరవడంతో ఆసుపత్రి పాలయ్యారన్నారు. ‘ యాదాద్రి భువనగిరి బాలికల పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News