వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమేనని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ పేర్కొన్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నకు తావు లేదని, తనను గమనించిన ప్రతి ఒక్కరికీ తనసామర్థం తెలుసని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు వయోభారం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిందని ఇటీవల వస్తున్న వార్తల నేపథ్యంలో హారిస్ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
81 ఏళ్ల వయోభారంతో బైడెన్ జ్ఞాపకశక్తిలో కొన్ని లోపాలను గుర్తించినట్టు ఇటీవల ఓ నివేదిక పేర్కొంది. ఆ నివేదికకు రెండు రోజుల ముందు ఈ ఇంటర్వూ జరిగింది. బైడెన్ గురించి ఆమె ప్రశంసిస్తూ ఆయన దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఒకచోట చేర్చే విశ్వసనీయమైన నాయకుడని పేర్కొన్నారు. బైడెన్ జ్ఞాపకశక్తిపై నివేదిక సమర్పించిన స్పెషల్ కౌన్సిల్ గురించి మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు అనవసరమని, కచ్చితమైనవి కావని, సరైనవి కావని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిని తక్కువ చేసి చిత్రీకరించడం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నదని హారిస్ వ్యాఖ్యానించారు.