మన తెలంగాణ/ హైదరాబాద్: నగరంలోని ఎల్ బి స్టేడియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పోలీసు ఉద్యోగాల భర్తీ నియామక పత్రాలను సిఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు అందజేశారు. మొత్తంగా 13445 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. ‘నిరుద్యోగులారా అధైర్యపడకండి…మీ సమస్యలు పరిష్కరిస్తాం‘ అని సిం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువకుల ఉద్యమం వల్లే తెలంగాణ ఏర్పడిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీకి రాకుండా నల్లగొండకు పోయి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదని అన్నారు. కెసిఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఆగం చేశారని అన్నారు. కంచెర గాడిదను ఇంటికి పంపి, ప్రజలు రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
‘నిరుద్యోగ యువకులారా ఈ రాష్ట్రం మీదే. సాధించుకున్నది మీరే. మీ కోసం పనిచేయడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ కోసం 24 గంటలూ కష్టపడి పనిచేస్తా. మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా రావు, సిఎస్ శాంతి కుమారి, అనేక మంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.