Sunday, December 22, 2024

బిసి సిఎం నినాదంతో బిసిలను మోసం చేసిన బిజెపి

- Advertisement -
- Advertisement -

బిసిలు శాసనసభా పక్ష నేతకు పనికిరారా ?
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సిఎం నినాదంతో బిజెపి బిసిలను మోసం చేసిందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉన్న బిసిలు శాసనసభా పక్ష నేతకు అనర్హులు ఎలా అయ్యారో తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బిసిలకు బిజెపి సమాధానం చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో బిజెపిని డిమాండ్ చేశారు. బిసి నినాదాన్ని బిజెపి బుట్ట దాఖలు చేసిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తానన్న బిజెపి నేడు శాసనసభా పక్ష నేతను కూడా అగ్రకులాలకే కేటాయించి బిసి నినాదాన్ని బుట్ట దాఖలు చేసిందని ధ్వజమెత్తారు.

బిజెపి శాసనసభ పక్ష నేతగా నిర్మల్ శాసన సభ్యులు అగ్రకులానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బిజెపి నియమించడం పట్ల జాజుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపి బిసిలను మరోసారి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎల్‌బి స్టేడియంలో బిసి గర్జన నిర్వహించి బిసి ముఖ్యమంత్రి చేస్తామని లక్షలాదిమంది సాక్షిగా ప్రకటించి నేడు మాట మరిచి బిసి నినాదం తుంగలోకి తొక్కి కనీసం శాసనసభాపక్ష నేత కూడా బిసికి ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. బిసి ముఖ్యమంత్రి నినాదం బిజెపి ఎన్నికల ఎత్తుగడ కోసమే కాని బిసిలను నిజంగా ముఖ్యమంత్రి చేయాలని చిత్తశుద్ధి లేదనడానికి మహేశ్వర్ రెడ్డి ఎన్నికనే ప్రత్యక్ష సాక్షమని ఆయన అన్నారు. బిజెపి బిసిలకు క్షమాపణ చెప్పి మళ్లీ బిసిలను మోసం చేయనని వాగ్దానం చేయాలని జాజుల డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఆయన నిలదీశారు. బిసి ముఖ్యమంత్రి చేస్తామని, దళిత ముఖ్యమంత్రి చేస్తామని మల్లొకసారి ఇంకెప్పుడు మాట్లాడకూడదని జాజుల హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News