Saturday, December 21, 2024

పదేళ్లు నేనే సిఎం..

- Advertisement -
- Advertisement -

రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది
బిఆర్‌ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది
నిరుద్యోగులు అధైర్యపడొద్దు.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తాం
కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సిఎం రేవంత్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉండి మీ కోసం 24 గంటలు కష్టపడి పనిచేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికైన 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించారు. ఈ వేదికగా చెబుతున్నా.. ‘మీ రేవంతన్నగా నిరుద్యోగ యువకులకు నేను అండగా ఉంటా. ఈ ప్రభుత్వం మీది. ఇది పేదల ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నాం. నర్సింగ్ ఆఫీసర్స్, సింగరేణి ఉద్యోగాల్లో చిక్కుముడులు విప్పి నియామకాలు పూర్తి చేసాం.

మాట ఇచ్చినట్టుగానే 15 రోజుల్లో కానిస్టేబుల్స్‌కు నియామకపత్రాలు అందిస్తున్నా’మన్నారు. కెసిఆర్ తన బంధువులకు, కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగలేకపోయారని, కానీ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గురించి ఆలోచించ లేదని సిఎం రేవంత్ అన్నారు. ’తెలంగాణను కబళించడానికి గంజాయి, డ్రగ్స్ ముఠాలు తిరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. నిరుద్యోగ యువకులారా ఈ రాష్ట్రం మీదే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న మీరు, మీకోసం పని చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కెసిఆర్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఎలా వస్తారో నేనూ చూస్తా.’ అని సవాల్ విసిరారు. గత బిఆర్‌ఎస్ హయాంలో ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. ’టిఎస్‌పిఎస్‌సి ని ప్రక్షాళన చేశాం. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. బిఆర్‌ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది.’ అని వెల్లడించారు.
నల్గొండ సభలో కెసిఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్
నల్గొండ సభలో మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వ్యాఖ్యలపై సిఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చె బర్రెను ఇంటికి పంపి దున్నపోతును తెచ్చుకున్నారని కెసిఆర్ అన్నారని, అయితే, కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని గురువారం అసెంబ్లీలో ఓ అటెండర్ తనకు చెప్పినట్లు సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ’స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారు. అయితే, కెసిఆర్ పాలనలో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఉద్యోగాల భర్తీపై అధికారులతో సమీక్షించి అన్ని ఆటంకాలు తొలగించాం. నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీష్ రావు అంటున్నారు. ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తేనే నాకు నిద్ర పడుతుంది. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం. కుటుంబ సభ్యులకే కెసిఆర్ పదవులు, ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదు. శాసనసభకు రమ్మంటే ఆయన రాలేదు. నల్గొండ వెళ్లి బీరాలు పలికారు. కృష్ణాలో నీటి వాటాలపై సిఎంగా కేసీఆర్ పెట్టిన సంతకాలు తెలంగాణ ప్రజల మరణ శాసనాలు. అవి మన పాలిట గుదిబండగా మారాయి. మళ్లీ నీళ్ల అంశాన్నే ఎత్తుకుంటున్నారు. ఢిల్లీతో కొట్లాడుదామంటే కెసిఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. మేడిగడ్డ మేడిపండు చందంగా మారింది. పొట్ట విప్పితే అన్నీ పురుగులే ఉన్నాయి.’ అంటూ సిఎం రేవంత్ మండిపడ్డారు.
‘నిరుద్యోగులెవరూ అధైర్యపడొద్దు’
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ’సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో.ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తున్నాం. గత ప్రభుత్వానికి తొమ్మిదన్నరేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనే రాలేదు. అధికారులతో సమీక్షించి ఉద్యోగాల భర్తీకి అన్నీ ఆటంకాలు తొలగించాం.’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, డిజిపి రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News