బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోంది
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలి
కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోందని ఆయన మండిపడ్డారు. అంబానీ, అదానీ లాంటి కుబేరులకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. దేశ రాజధాని సరిహద్దుల్లో తమ హక్కుల కోసం రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. దివంగత శ్రీమతి స్వామినాథన్ సిఫార్సులను బిజెపి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన రాయ్‌పూర్ సమావేశంలో వ్యవసాయంపై తన తీర్మానంలో ఎంఎస్‌పికి చట్టపరమైన హామీని అందజేస్తామని హామీనిచ్చామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారం చేపట్టగానే భారత ప్రభుత్వం మొదటి, ప్రధాన ఎజెండా ఇదే అవుతుందని కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ సమాజానికి హామీ ఇస్తుందన్నారు.
రెండేళ్లు గడిచినా ప్రధాని పట్టించుకోలేదు
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడు, బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి స్వయంగా ఎంఎస్‌పిని అందజేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో దేశ రైతులు దాదాపు ఒక సంవత్సరం పాటు నిరసన ధర్నా నిర్వహించినప్పుడు, ఎంఎస్‌పికి చట్టపరమైన హామీని పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, రెండేళ్లు గడిచినా ఏమీ జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రైతులు, మిస్టర్ మోడీ వాగ్దానాన్ని గుర్తు చేయడానికి, దేశ రాజధాని వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. కానీ, వారు దేశ రాజధాని వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. హర్యానా రాష్ట్ర పోలీసులు రైతుల కవాతును నిరోధించడానికి క్రూరమైన, అమానవీయ మార్గాలను ఆశ్రయిస్తున్నారన్న భయంకరమైన దృశ్యాలను దేశం మొత్తం చూసిందన్నారు. పంజాబ్, హర్యానాలో పెట్రోల్ పంపులు ఎండిపోయాయని, అక్కడి బంక్‌లకు పెట్రోల్ సరఫరా నిలిపివేశారని ఆయన తెలిపారు.
10 ఏళ్లయినా విదేశీ బ్యాంకుల్లో నల్లధనం వెనక్కి…
విదేశీ బ్యాంకుల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తానని, దానికి కాంగ్రెస్‌ను నిందించారని, ప్రతి భారతీయ బ్యాంకు ఖాతాలో ఒక్కోక్కరికి రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని మోడీ చెప్పారని ఆ మాట కూడా ఇప్పటివరకు అమలు కాలేదని ఆయన ఆరోపించారు. అధికారాన్ని స్వీకరించిన తర్వాత అతను ప్రతి భారతీయుడు ‘జీరో-బ్యాలెన్స్’ బ్యాంక్ ఖాతాను తెరవమని ప్రచారాన్ని చేసి పదేళ్లు గడిచాయని, ఇప్పటివరకు బ్యాంకు బదిలీలు జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని మోడీ చెప్పారని ఆ లెక్కన దేశంలోని యువతకు ఇరవై కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఆయన ఎద్దేవా చేశారు. కానీ, దేశంలో నిరుద్యోగం రేటు గత 45 ఏళ్ల కన్నా అత్యధికంగా నమోదయ్యిందన్నారు. దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు రెండింతలు పెరిగాయన్నారు. పదేళ్లలో దేశ అప్పులు 2014లో దాదాపు రూ.55 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ.185 లక్షల కోట్లకు మూడు రెట్లు పెరిగాయన్నారు.