ఏ యుగాన్ని చూసినా ఆ యుగంలో ఒక పుణ్య పురుషుడు ఉద్భవిస్తాడు. అతడు ధర్మాన్ని, నీతిని ఏకం చేసి జాతి కోసం పాటు పడతాడు. అలా వచ్చినవారే శ్రీరాముడు, కృష్ణుడు, మహమ్మద్ ప్రవక్త, యేసుక్రీస్తు. ఇదే విధంగా బంజారా జాతిలో చూసినట్లయితే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. మహారాజ్ సేవాలాల్ బంజారా జాతిని ఒక తాటిపై తీసుకు వచ్చాడు. వారిలో చైతన్యం నింపాడు. వారికి ధర్మాన్ని బోధించి, ఆచరించే విధంగా ప్రోత్సహించాడు. బంజారా సంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడాలని ఆదేశించాడు. సేవాలాల్ మహరాజ్ జగదాంబ దేవి ఉపాసకుడు. దేవిని నిరంతరం ఆరాధించేవాడు. నిరంతరం బంజారా జాతికోసమే పాటుపడేవాడు.
సేవాలాల్ మహరాజ్ 15 ఫిబ్రవరి 1739లో అనంతపూర్ జిల్లా గుత్తి మండలం సేవాఘడ్ రాంజీనాయక్ తండాలో జన్మించాడు. ఈయన దేవి మేరమ్మ (జగదాంబ) అనుగ్రహంతో జన్మించాడు. తల్లి ధర్మణిబాయి, తండ్రి భీమానాయక్. భీమా నాయక్‌కి సంతానం లేకపోతే దేవి మేరమ్మ (జగదాంబ) గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సును మెచ్చి దేవి మేరమ్మ ‘భీమా ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు. ఏం ఆపద వచ్చింద’ ని అడుగుతుంది. భీమా ‘తల్లి నాకు సంతానం లేద’ ని చెబుతాడు. ‘నీకు సంతానం ఇస్తాను కానీ, నాకో వాగ్దానం చెయ్యాలి. దానికి నీవు ఒప్పుకుంటే సంతానం ప్రసాదిస్తాను’ అని చెప్పింది. భీమా ‘సరే తల్లి’ అని అంటాడు. అప్పుడు మేరమ్మ ‘నీ తొలిచూరు బిడ్డను నాకు భక్తుడిగా చెయ్యి’ అని అడుగుతుంది. సంతానం లేని భీమా ఆలోచించకుండా అలాగే మాట ఇస్తాడు. అప్పుడు దేవి మేరమ్మ ‘కాళ్యాకుండ్’ (కాళ్యాకుండ్ అనే పేరు గల నీటిగుండం)లో స్నానం చేసి తన ఒంటిపైన మైలని ముద్దగా చేసి ఇస్తుంది. అప్పుడు భీమా నాయక్‌కి సేవ, హప్ప, బద్దు, భాణ అనే నలుగురు కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడు సేవాలాల్ మహారాజ్ పెరిగిన తరువాత కొంత కాలంలో మేరమ్మ (జగదాంబ) ప్రత్యక్షమై సేవాలాల్‌ని నాకు అప్పజెప్పమని భీమనాయక్‌ను అడుగుతుంది. అమ్మ వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవాలాల్‌ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాకాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలచుకోలేదని అంటాడు.
అప్పుడు మేరమ్మ సేవాలాల్‌కు ఎన్నో కష్టాల పాలు చేస్తుంది. అయిన సేవాలాల్ చలించడు. చివరకు తండా వాసులను కష్టాల పాలు చేస్తుంది. ఇదంతా సేవాలాల్ కారణంగా జరుగుతుందని తండావాసులు, తండా నుంచి ఆయనను బహిష్కరిస్తారు. కానీ అమ్మవారికి మేకలను బలి ఇస్తే అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు సాతీ భావానీలకు మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు. ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు. కాని సేవాలాల్ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు. ఎందుకంటే ఆయన అమాయక మూగజీవుల్ని బలి చేస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్ ప్రజల సమక్షంలో తన తలను ఖండిరచుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర పడేస్తారు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు. దేవి సేవాలాల్ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్ళు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్ నెగ్గాడు. నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయాణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి సేవాలాల్ జగదాంబమాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు.
ఆరునెలల ప్రాయంలోనే సేవాలాల్ కొండపైన చాముండేశ్వరీ దేవతా మూర్తులతో ఆటలు ఆడుకునేవాడు. సేవాలాల్- చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమా నాయక్ గమనించి అడిగితే ప్రతి దినం అలాగే ఆడుకుంటామన్నాడు. తల్లిసద్ది కట్టిస్తే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు. బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లిదండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది. సేవాలాల్ మహారాజ్ ఆలమందను మేపడానికి గడ్డి, నీళ్ళు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళేవారు. అలా వలసలుగా ఆంధ్రప్రదేశ్ ఆనంతపురం జిల్లా నుంచి మహారాష్ట్ర పౌర్యఘడ్ వరకు వెళ్ళారు. ఆ క్రమంలో హైదరాబాద్‌ని నిజాం పరిపాలిస్తున్నాడు. నిజాం సేవాలాల్ మహిమను చూసి అతనికి కొన్ని కొండన్ని కానుకగా ఇచ్చాడు. అవే నేటి ‘బంజారా హిల్స్’. జంగీ, భంగీలు ఆవులను నైజాం ప్రాంతంలోని బిడారులకు దానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఆవుల మందను నైజాం సైన్యం అడ్డగిస్తుంది. జంగీౠ భంగీ, సైనికుల మధ్య యుద్ధం జరుగుతుంది. నిజాం సైనికులు ఓడిపోతారు. ఈ విషయం నిజాంకి తెలియజేస్తారు. అప్పుడు నిజాం జంగీ, భంగీ ధైర్యసాహసాలకు మెచ్చి వారిని రాజ దర్బారుకు ఆహ్వానించి ఒక రాజపత్రము (శాసనం) విడుదల చేస్తాడు. ఆ శాసనం ప్రకారం జంగీ, భంగీ వారి ఆవుల మందలు ఎక్కడైన మేపుకొనుటకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలని, ఎక్కడైతే నవాబుల గుర్రాలు మేస్తాయో అక్కడ కూడా జంగీ, భంగీల మందలు మేస్తాయి. బంజార భాషలో ఇలా అంటారు.
రంజన్ కా పాణి (కుండలోని నీళ్ళు), ఛప్పర్ కా ఘాస్ (పచ్చని గడ్డి), ఏక్ దిన్ కా తీన్ ఖూన్ మాపి (ఒక్క రోజులో మూడు హత్యలు మాఫీ), జహా అసఫ్ ఖాన్ కా ఘోడ (ఎక్కడి వరకు అసఫ్ ఖాన్ గుర్రాలు సంచరిస్తాయో), వహా జంగి, భంగీ కా బైల్ (అక్కడి వరకు జంగి, భంగీల ఎడ్లు ప్రయానిస్తాయి) నిజాం రాజ్యంలో ఎక్కడైనా, ఎప్పుడైనా జంగి, భంగీల ఆలమందలు పచ్చని గడ్డి మేయవచ్చు. నీళ్ళు తాగవచ్చు. వారిని ఎవరు కూడా ఆపడానికి లేదు. పన్నులు వసూలు చేయడం చేయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. ఇలా సంత్ సేవాలాల్ మహారాజ్ అనంతపురంలో మొదలు పెట్టిన వలసను కొనసాగిస్తూ పోయాడు. ఒక ఊరిలో పెళ్ళి చేసుకునే పెళ్ళి కొడుకు మరణిస్తాడు. సేవాలాల్ మహిమ వల్ల బతికిస్తాడు.
గరిశ్యా షాండ్ (ఎద్దు): గరిశ్యా షాండ్ ఆ మంద ముందుకు నడుస్తుంటే మిగిలిన జీవాలు దానిని అనుసరించేవి. ఏ ఉపద్రవంగానీ, ఆపదగానీ వస్తే ఆ గరిశ్యా షాండ్‌కి ముందే తెలిసిపోయేది.
లదణి హోటో ఫెరలరే, అంగమన ఖోటో దికారోరా
ఆ గరిశ్యా షాండ్ సేవాలాల్ మహారాజ్‌కి ఇలా విన్నవించుకుంటే ‘వలస వెనకకు మళ్ళీంచుకో, ముందరా ఏదో ఆపద వస్తున్నట్టు సూచనలు వస్తున్నవి. ఈ ఆవుల మందకు, బంజారాలకు అవినాభావ సంబంధం ఉంది. రెంటిని విడదీసి చూడలేం. సేవాలాల్ మహారాజ్ అలా వలస వెళ్తు వెళ్తు తండాలనీ ఏకం చేస్తున్నాడు. ఆ తండా ప్రజలు జగదాంబ దేవి కంటే సేవాలాల్‌ని ఎక్కువగా మ్రొక్కడం, భక్తులు కావడం జరిగింది. ఇదీ చూసి జగదాంబ కోపగించి, సేవాలాల్ బ్రహ్మచారి దీక్ష భంగం కలిగించడానికి పెళ్ళి చేసుకోమంటుంది. అప్పుడు సేవాలాల్ ‘నేను బ్రహ్మచారిని, నేను పెళ్ళి చేసుకోన’ని చెప్తాడు. ‘స్వర్గంలో వెళ్ళి బ్రహ్మను అడుగుదా”మని జగదాంబ తీసుకువెళ్ళి, తనలో లీనం చేసుకుంటుంది. సంత్ సేవాలాల్ మహారాజ్ పౌర్యఘడ్‌లో సమాధి తీసుకుంటాడు.
అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటీష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ బంజారాలు నడిచిన దారిలోనే, వారి ఎడ్లబడ్లు నడిచి చేసిన బాటలోనే ఈనాడు మనకు రవాణా మార్గం ఏర్పడిరదని చెప్పవచ్చు. పెద్దపెద్ద రహదారులు, రైల్వేలైన్లు కూడా ఏర్పడ్డాయని భావించవచ్చు. ఆ క్రమంలో బ్రిటీష్, ముస్ల్లిం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురైయ్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారు. సేవాలాల్ మహరాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమించింది.
బంజారాలు మొఘల్ పాలకులకు తరువాత బ్రిటిష్ వారికి ఆయుధాలు, వస్తువులను సరఫరా చేశారు. వారు ఆవులు, ఎద్దులను బందోబస్తుగా ఆయుధాల రవాణాకు ఉపయోగించారు.
వారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించేవారు. అలా వారు సంచార జీవితాలను గడిపేవారు. నీటి వసతి, తమ ఆవులు, ఎద్దులను మేపడానికి సౌకర్యాలు ఉన్న అటవీ ప్రాంతాలలో వారు నివసించడం ప్రారంభించారు. సమూహంలో నాయకుడి (నాయక్) వద్ద అత్యధిక సంఖ్యలో ఆవులు, ఎద్దులు ఉండేవి. వారు వలస వెళ్లి ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇటువంటి నివాసాలను తాండాలు అంటారు. తండా పెద్దగా ‘నాయక్’ వ్యవహరిస్తాడు. అతడికి సూచనలు, సలహాలు ఇవ్వగలిగే అనుభవజ్ఞుడిగా ‘డావో’ (నాయక్‌కి కుడి భుజంగా ఉండేవాడు) ఉంటాడు. గొడవలు, వరకట్నం, వివాహ సమస్యలు, భూ వివాదాలు తలెత్తినప్పుడు పంచాయతీ (నసాబ్)కి పిలుస్తారు. కర్భారి తాండా ప్రజలను ప్రకటించి సమావేశపరుస్తాడు. ఇరు వర్గాల వాదనలు విని పంచాయితీ చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఆ పంచాయితీ నిర్ణయం చెప్పడానికి 2-3 రోజులు కూడా పట్టవచ్చు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరు వర్గాలు కట్టుబడి ఉండాల్సిందే. ఈ విధంగా శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతిని ఏకతాటిపై నడిపించి, బంజారాలకు ఆరాధ్య దైవంగా మారారు. అతని ఆశీర్వాదం వల్లనే, జగదాంబ ఆశీస్సుల వల్లనే ఈ రోజు ప్రతి తండాలో సేవాలాల్, జగదాంబ గుళ్ళు వెలిశాయి. ఫిబ్రవరి 15వ తేదీని బంజారా బిడ్డలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
బి. విజయ్ కుమార్
95055 20097