టీమిండియా తరఫున టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగిపోతోంది. ఇంగ్లండ్ తో గురువారం జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడి 62 పరుగులు చేసిన సర్ఫరాజ్, రవీంద్ర జడేజా చేసిన పొరబాటు వల్ల రనౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ సంగతి అలా ఉంచితే, సర్ఫరాజ్ ఖాన్ తోపాటు అతని తండ్రి నౌషాద్ ఖాన్ గురించి కూడా అందరూ చెప్పుకుంటున్నారు. కుమారుడికి కోచ్ గా వ్యవహరించి, అతనినొక చక్కటి బ్యాటర్ గా తీర్చిదిద్దిన నౌషాద్ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారారు. తాజాగా ప్రముఖ బిజినెస్ మాన్ ఆనంద్ మహీంద్రా కూడా నౌషాద్ ఖాన్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
‘నమ్మకం కోల్పోకూడదు, అంతే. శ్రమ. ధైర్యం. ఓర్పు. కుమారుడిలో స్ఫూర్తి రగిలించాలంటే ఓ తండ్రికి ఇంతకంటే కావలసిన గొప్ప లక్షణాలు ఇంకేముంటాయి?’ అని ఆనంద్ కామెంట్ చేస్తూ, సర్ఫరాజ్, అతని తండ్రి నౌషాద్ లకు సంబంధించిన వీడియోను రీపోస్ట్ చేశారు.
నౌషాద్ ఖాన్ కు తాను ఒక థార్ జీపును బహుమతిగా అందిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.