Sunday, December 22, 2024

కాంగ్రెస్ ఖాతాలపై మెరుపు దాడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రూ. 210 కోట్ల మేరకు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ డిమాండ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలను శుక్రవారం స్తంభింపచేశారు. అయితే, వచ్చే వారం మరింత విచారణ జరిగేంత వరకు ఖాతాల నిర్వహణకు ఐటి అప్పీలేట్ ట్రైబ్యునల్ పార్టీకి ఆ తరువాత అనుమతి ఇచ్చింది. దీనితో పార్టీకి పెద్ద ఎత్తున ఉపశమనం కలిగినట్లయింది. ఐటి శాఖ చర్య రాజకీయ కార్యకలాపాలను ప్రభావితం చేసిందని పార్టీ వ్యాఖ్యానించింది. ఐటి శాఖ అధికారులు తమ ఖాతాలను స్తంభింపచేశారని ప్రకటించేందుకు అంతకు ముందు పత్రికా గోష్ఠిలో ప్రసంగించిన కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఐటి అప్పిలేట్ ట్రైబ్యునల్ తమ ఖాతాలపై రూ. 115 కోట్లు పరిమితి విధించిందని, ఆ పరిమితికి మించి ఖర్చు చేయడానికి పార్టీకి అనుమతి లభించిందని తెలియజేశారు. ఐటి శాఖ ఉత్తర్వుపై ట్రైబ్యునల్ ముందు హాజరైన పార్టీ నేత వివేక్ తన్ఖా ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఖాతాలు స్తంభనలో ఉండిపోయినట్లయితే ‘ఎన్నికల ఉత్సవం’లో కాంగ్రెస్ పాల్గొనజాలదని తాను ట్రైబ్యునల్‌కు సూచించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ట్రైబ్యునల్ వచ్చే బుధవారం విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు పార్టీ నేతలు ఐటి శాఖ చర్యపై అమిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యంపై దాడి అని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్న మాకెన్ ట్రైబ్యునల్ ఉత్తర్వుపై వివరణ ఇచ్చారు. ‘మా పిటిషన్‌ను పురస్కరించుకుని మేము బ్యాంకులలో రూ. 115 కోట్లు అట్టిపెట్టవలసి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ, ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటిఎటి) స్పష్టం చేశాయి. బ్యాంకు ఖాతాలలో ఆ రూ. 115 కోట్లను కనీస మొత్తంగా ఉంచాలి’ అని ఆయన తెలిపారు. ‘మేము దానికి మించి ఖర్చు చేయవచ్చు’ అని మాకెన్ ‘ప్రజాస్వామ్యం స్తంభన’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో ‘ఎక్స్’ పోస్ట్‌లో సూచించారు. ‘అంటే ఆ రూ. 115 కోట్లను స్తంభింపచేశారు. ఆ రూ. 115 కోట్లు మా కరెంట్ అకౌంట్లలో ఉన్న మొత్తం కన్నా ఎంతో ఎక్కువ’ అని ఆయన వివరించారు. ‘కుంటి సాకుతో’ తమ ఖాతాలను స్తంభింపచేయడం సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రెండు వారాలు కూడా సమయం లేనప్పుడు సకల రాజకీయ కార్యకలాపాలనూ ప్రభావితం చేసింది’ అని కాంగ్రెస్ కోశాధికారి అంతకుముందు చెప్పారు.

భారతీయ యువజన కాంగ్రెస్ (ఐవైసి)తో సహా ఆ ఖాతాలను ఎన్నికల సంవత్సరం 2018-19కి సబంధించిన ఆదాయపు పన్ను శాఖ డిమాండ్‌పై స్తంభింపచేశారని మాకెన్ తెలిపారు. ఆ ఏడాదికి సంబంధించిన ఐటి రిటర్న్‌లను పార్టీ కొన్ని రోజులు ఆలస్యంగా దాఖలు చేసిందని ఆయన తెలిపారు. తమ వేతనాల నుంచి విరాళాలుగా పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలు పార్టీకి ఇచ్చిన రూ. 14.4 కోట్ల నగదు రసీదులలో ఒక లోపానికి సంబంధించినది ఈ వ్యవహారం అని ఆయన వివరించారు. ఖాతాల స్తంభనకు సంబంధించిన ఐటి అధికారులు ఉత్తర్వు బుధవారం వచ్చినట్లు ఆయన తెలిపారు. నాలుగు ప్రధాన బ్యాంక్ ఖాతాల స్తంభన జరిగిందని మాకెన్ చెప్పగా పార్టీ వర్గాలు ఆ తరువాత ఆ సంఖ్యను తొమ్మిదిగా పేర్కొన్నాయి. తన సార్వత్రిక నిధుల సేకరణ కార్యక్రమం కింద అందుకున్న నిధులను కూడా పార్టీ వినియోగించలేకపోయిందని మాకెన్ విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లలో ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ‘మోడీజీ భయపడకండి. కాంగ్రెస్‌ది ధన వ్యామోహం కాదు కానీ ప్రజల అధికారానికి లోబడింది& మేము నియంతృత్వానికి ఎన్నడూ లొంగిపోలేదు.

ఎన్నటికీ లొంగబోము’ అని రాహుల్ గాంధీ అన్నారు.‘ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భారత ప్రజాస్వామ్యం పరిరక్షణకు నిరంతరం పోరాడతారు’ అని రాహుల్ ‘దాడి ప్రభావంలో ప్రజాస్వామ్యం’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో స్పష్టం చేశారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్‌లోని అతిపెద్ద ప్రతిపక్షం ఖాతాల స్తంభనకు ప్రభుత్వాన్ని ‘అధికారం మత్తు’లో ఉందని ఖర్డే ఆరోపిస్తూ ఇది ప్రజాస్వామ్యంపై ‘తీవ్ర దాడి’ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఖాతాలనే కాదు, భారత ప్రజాస్వామ్యాన్నే స్తంభింపచేశారు’ అని వేణుగోపాల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News