Monday, November 18, 2024

ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్న కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నదన్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక నుంచి సూట్ కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. శుక్రవారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ నాయకులు వెళ్లాలాల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి కమలం తీర్థం పుచుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది కానీ అమలు చేయడం లేదని, ఢిల్లీకి సూట్ కేసులను మోసే పనిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక నుంచి ఇక్కడికి సూటు కేసులు వచ్చాయని, రాహుల్ గాంధీ కోసం తెలంగాణలో బిల్డర్ల దగ్గర, కంపెనీలు, కాంట్రాక్టర్లను కాంగ్రెస్ బెదిరిస్తుందన్నారు. ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ ఆరు గ్యారంటీల అమలు లేదని, మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ లా కాదు చేసేదే చెప్తుంది చెప్పేది చేస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కుటుంబ పార్టీలే ః
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు దొందు దొందే ఈ రెండు అవినీతి, కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు మజ్లిస్ పంచన చేరుతాయని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయని, బిఆర్‌ఎస్ పార్టీ, కెసిఆర్ మీద దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పార్టీ కావడంతో సీబీఐతో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తే, విజిలెన్స్ పేరుతో కాలయాపన చేస్తున్నదన్నారు. విజిలెన్స్ తో అయ్యేది లేదు పోయేది లేదు. కాంగ్రెస్ చెయ్యి బస్మాసుర హస్తం చేయ్యి గుర్తుకు ఓటేస్తే అదే చెయ్యిని ప్రజల తలపై పెట్టి మోసం చేస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా, జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ప్రధాని మోదీతోనే తెలంగాణ అభివృద్ధి ః
గత తొమ్మిదన్నరేండ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్, రూ. 450 కోట్లతో కాచిగూడ, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను ఇచ్చిందన్నారు. ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్ కానుందని, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలంటే మోదీ నాయకత్వం,బిజెపి నాయకత్వం అవసరమన్నారు. భద్రాద్రి అభివృద్ధికి రూ.50 కోట్లు ఇచ్చారని, వరంగల్ రామప్ప దేవాలయానికి మోదీ కృషితో యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలిపారు. జోగిలాంబ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో లక్షా 20 వేల కోట్ల రూపాయల విలువైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్ ఆర్ రోడ్డును మోదీ మంజూరు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఇది గేమ్ చేంజర్ కానుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత బిజెపి సర్కార్‌దేనన్నారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం ః
దేశంలో ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిత్యం ఉగ్రవాదుల బాంబులతో రావణకాష్ఠంలా మండే కశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తేసి అక్కడ శాంతి నెలకొల్పిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనన్నారు. దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి. హైదరాబాద్ లో ఒకప్పుడు బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల చేతిలో పలువురి హత్యలు జరిగేవని, మోదీ వచ్చిన తర్వాత ఐఎస్‌ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని తెలిపారు.. పాక్ లో ఇండియన్ కరెన్సీ ముద్రించి భారత్ లో చెలామణి చేసేవారు. ఇప్పుడు అది ఆగింది. ప్రపంచం దృష్టిలో పాక్ ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. వచ్చే 25 ఏళ్ల్లలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్ ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. అందులో భాగస్వామ్యం అయ్యేందుకు మనం సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News