రేవారి (హర్యానా) : కాంగ్రెస్ పార్టీ తనపై అనేక రకాల మోర్చాలను ఎక్కుపెట్టిందని, అయితే తనకు ప్రజారక్షక కవచం వెన్నుదన్నుగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీకి దేశ కీలక విషయాలపై సరైన విధానం లేదని , రామాలయం, అంతకు ముందటి ఆర్టికల్ 370 పైనా పార్టీ వైఖరి అనుచితంగా ఉందని విమర్శించారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసిన తరువాత శుక్రవారం జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికలు వచ్చిపడుతున్న ఈ దశలో కాంగ్రెస్ పార్టీ తనపైకి పలు విధాలుగా దండయాత్రలకు దిగుతోందని, అయితే ప్రజలే తనకు పెట్టనికోటలు, రక్షణ కవచాలు అని తేల్చిచెప్పారు. అరబ్ ఏమిరేట్స్, ఖతార్‌లలో పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత దేశంలో ఆయన సభలలో పాల్గొనడం ఇదే తొలిసారి, అరబ్‌దేశాలలో తన పర్యటన గురించి చెపుతూ ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ఇప్పుడు భారత్ పట్ల గౌరవం ఇనుమడించిందన్నారు.
ఈ ఖ్యాతి కేవలం ఈ మోడీ ఒక్కడిదే కాదు, ప్రతి భారతీయుడిది అన్నారు. దేశం అత్యున్నత శిఖరాలకు చేరుకోవడం , ప్రజలందరి అంకితభావం ఆశీస్సులతోనే సాధ్యం అయిందని చెప్పారు. ఎప్రిల్ మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి సారధ్య ఎన్‌డిఎకు 400కు పైగా సీట్లు ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రమలలో కాలం గడుపుతుందని, వారికి చివరికి భగవాన్ రాముడు కూడా కల్పితమే అని, ఆలయ నిర్మాణం వారికి ఇష్టం లేదని, అయితే ఇప్పుడు వారు కూడా జై సియారామ్ వల్లిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కుటుంబ ప్రేమలో కూరుకుంది. హర్యానాలోనూ ఇదే పరిస్థితి ఉంది. గడ్డు పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను ఇక ఎవరూ రక్షించలేరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం జన్మహక్కు అనుకుంటుంది. కానీ ఇది చెల్లనేరదని స్పష్టం చేశారు. మోడీని దెబ్బతీసేందుకు కూటమిగా నిలవాలనుకున్నారు. అయితే ఇప్పటికే తలోదిక్కు చేరుకున్నారని తెలిపారు. రేవారిలో తలపెట్టిన ఎయిమ్స్‌కు రూ 9770 కోట్ల వ్యయ అంచనాలు వేశారు.