మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపితో బిఆర్‌ఎస్‌కు పొత్తు ఉన్నా మల్కాజిగిరి ఎంపీ స్థానం తమదేనని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి తేల్చిచెప్పారు. అసెంబ్లీలో లాబీలో శుక్రవారం మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ టికెట్‌పై మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఎవరూ బిజెపితో టచ్‌లో లేరని.. తమ ఎంఎల్‌ఎలు పార్టీ మారే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. బిజెపితో బిఆర్‌ఎస్ పొత్తు ఉంటే.. తమ ఎంఎల్‌ఎలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. బండి సంజయ్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదని ఎద్దేవా చేశారు.
ఒకవేళ బిజెపితో పొత్తు ఉన్నా…పొత్తులో భాగంగా మల్కాజిగిరి ఎంపి టికెట్ బిఆర్‌ఎస్ పార్టీకేనని స్పష్టం చేశారు. మల్కాజిగిరి బిఆర్‌ఎస్ ఎంపీ టికెట్ ‘భద్రంగా’ ఉందంటూ పరోక్షంగా తన కొడుకు భద్రారెడ్డికే వస్తుందని మల్లారెడ్డి హింట్ ఇచ్చారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తే ఫ్యామిలీ పాలిటిక్స్ అని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. తన అల్లుడు, మల్కాజిగిరి ఎంఎల్‌ఎ రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు.. తమ కుటుంబం వేరు అని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని కానీ, ప్రభుత్వం తమపై కక్ష సాధించాలనుకుంటే తాను ఏం చేయలేనని పేర్కొన్నారు.