Monday, December 23, 2024

మేడారం వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేశాం

- Advertisement -
- Advertisement -

డబ్బుతో సంబంధం లేకుండా ఉచితంగా దర్శనం: మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్ : మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. శనివారం మేడారంలో తాత్కాలిక బస్ స్టేషన్‌ను ప్రారంభించారు. 55 ఎకరాల్లో బెస్ క్యాంప్‌తో కూడిన బస్ స్టాండ్ ను ఏర్పాటు చేసినట్లు ఒకేసారి 30 వేల మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ సిద్దం చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి సుధాకర్ ప్రారంభానికి రాలేక పోయారని తెలిపారు. గతంతో పోలిస్తే 20 ఎకరాలను ఎక్కువగా బస్ స్టాండ్‌ను విస్తరించామని పేర్కొన్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, రెండు సంవత్సరాల కొకసారి సమ్మక్క, సారక్క వన దేవతలు బయటకు వస్తారన్నారు. డబ్బులతో సంబంధం లేకుండా ప్రజలు వచ్చే పండుగ మేడారం జాతరనని అన్నారు. వందల కిలోమీటర్లు బంగారాన్ని నెత్తిన పెట్టుకొని వస్తారని, మేడారం కు వచ్చే దారిలో పార్కింగ్, తాత్కాలిక బస్ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతర విజయవంతంలో ఆర్టీసీ కృషి ఎంతో ఉంటుందని, భక్తులు స్వీయనియంత్రణతో దర్శనం చేసుకోవాలని కోరారు.

భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈనెల 21న ప్రారంభమయ్యే ప్రసిద్ధ గిరిజన జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది . ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24 వరకు రైళ్లు నడపనున్నట్లు కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ద్వైవార్షిక కార్యక్రమం కోసం భక్తులు మేడారం వెళ్లేందుకు ఈ ప్రత్యేక రైళ్లు దోహదపడతాయన్నారు. ప్రత్యేక రైళ్లు 07017/07018 సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ – సిర్పూర్ కాగజ్‌నగర్, 07014/07015 వరంగల్ – సికింద్రాబాద్ – వరంగల్ , 07019/0720 నిజామాబాద్ – వరంగల్ – నిజామాబాద్ ఈ రైళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలు, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భోంగీర్, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాలకు కనెక్టివిటీని నిర్ధారిస్తాయి. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు, సంరక్షించేందుకు, గిరిజన వర్గాల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News