Monday, December 23, 2024

మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయింది

- Advertisement -
- Advertisement -

నాడు దేవాలయం నేడు బొందల గడ్డ అయ్యిందా?…
ఎలా అయ్యిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి!
ప్రాజెక్టులు త్వరగా కట్టాలన్న ఆతృత తప్ప నాణ్యత పట్టించుకోలేదు
అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయ్యిందో కెసిఆర్ చెప్పాలని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం మేడిగడ్డను ఒకనాడు ఒక దేవాలయం అన్నారని, నేడు అదే దేవాలయాన్ని ఒక బొందల గడ్డగా అభివర్ణించడం విచారకరమని పేర్కొన్నారు. మేడిగడ్డ బొందల గడ్డగా ఎలా అయ్యిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు కెసిఆరే ఉన్నారని, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి అని కెసిఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని గుర్తు చేశారు.

భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత కెసిఆర్ శాసనసభకు వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిన కెసిఆర్ ఈ రోజు శాసనసభలో ఉండి ఉంటే బీటలు వారిన పిల్లర్లకు, శిల్పానికి సొల్యూషన్ ఇచ్చేవారేమో అని, అందుకే కెసిఆర్ సభలో ఉండాలని కోరుకున్నామని, కానీ ఆయన సభకు రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కెసిఆర్ సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం అంటే బ్యారేజీలు, రిజర్వాయర్లు, సబ్‌స్టేషన్లు, పంప్ హౌస్‌లు, కిలోమీటర్ల సొరంగాలు అని చెప్పేవాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నామని, కాళేశ్వరం అనే సమహారానికి బేస్ ఎక్కడ? అని ఒకసారి ఆలోచించుకోండని సూచించారు. ఈ ప్రాజెక్టుకు పునాది మేడిగడ్డ అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయని, దీని తర్వాత అన్నారం బ్యారేజీలో బుడగలు వస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత ఉన్న సుందిళ్ల బ్యారేజీలో సిపేజ్ మొదలైందని, పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని తమపై నిందలు మోపుతున్నారని పేర్కొన్నారు. తాను ఉంటే గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇచ్చేవాడినని, ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని నల్గొండ సభలో ప్రతిపక్ష నేత కెసిఆర్ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. గతేడాది నవంబర్‌లో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని, అప్పటినుంచి డిసెంబర్ 6 తేదీ వరకు కెసిఆర్ అపధర్మ ముఖ్యమంత్రిగా 46 రోజులపాటు ఉన్నారని అన్నారు. ఈ 46 రోజుల్లో ఆయన ఎన్ని నీళ్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపారో చెప్పాలని, అప్పుడు ఎందుకు నీళ్లు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు.

ఇష్టానుసారంగా అంచనాలు పెంచారు
2017లో కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఇరిగేషన్ సమావేశంలోనే అవినీతికి బీజం పడిందని, ఆ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చివేసి ఇష్టానుసారంగా అంచనాలు పెంచారని, కాళేశ్వరానికి సంబంధించి రెండు చోట్ల రిజర్వాయర్లు కట్టారు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రిజర్వాయర్‌ను కూడా ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామని, ఇప్పుడు కూడా ఉమ్మడి పాలన గురించి మాట్లాడడం సరికాదని చెప్పారు. ఆత్రుతగా ప్రాజెక్టు కట్టకుండా నాణ్యంగా కట్టి ఉంటే లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే భారీ నష్టం కనినిస్తుంటే కూడా బిఆర్‌ఎస్ నేతలు తప్పు ఒప్పుకోవట్లేదని విమర్శించారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై ఏం చేయాలనే దానిపై తాము గత ప్రభుత్వం మాదిరిగా హడావుడిగా ఆత్రుత పడదలచుకోలేదని స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజలకు నష్టం చేయబోమని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News