యాదాద్రి భువనగిరి: జిల్లా కేంద్రం సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌లో అర్థరాత్రి 12.30 నిమిషలకు అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సమయంలో అందరూ పడుకొని ఉండగా ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు సబ్ స్టేషన్ మొత్తం చుట్టుముట్టాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫైర్ మాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు ఎక్కువగా వ్యాపించడంతో పక్కనే గ్రామస్థులు నివస్తుండటంతో వారికి ఎలాంటి అపాయం జరగకుండా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే సబ్‌స్టేషన్ సగానికిపైగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం కారణంగా సబ్ స్టేషన్ కాలిబూడిదయ్యాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.