ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల పరిహారం
మరి కొందరికి ఇళ్ల నిర్మాణం, సాగు భూమి కూడా…
అటు వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న పునరావాస కాలనీ
మన తెలంగాణ / హైదరాబాద్ : కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతం అయ్యింది. అటవీ ప్రాంతం కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం కాలనీ పనుల పురోగతిని కవ్వాల్ లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఏం. డోబ్రియాల్ ఆదివారం సమీక్షించారు. స్థానిక అధికారులతో కలిసి పునరావాస కాలనీని సందర్శించటంతో పాటు, లబ్దిదారులతో సమావేశం అయ్యారు. పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపుపై ఇటీవల సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. తరలింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండటంతో పాటు, మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు.
దీనిలో భాగంగా పిసిసిఎఫ్ ఆదివారం నాడు క్షేత్ర పర్యటన చేశారు. మొదటి దశలో పునరావాసానికి రాంపూర్, మైసంపేట గ్రామాలు స్వచ్ఛందంగా అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వం (ఎన్‌టిసిఎ ) నిబంధనల ప్రకారం రెండు ప్రతిపాదనలతో అటవీశాఖ పనులను చేపట్టింది. గ్రామాల తరలింపులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏకమొత్తంగా 15 లక్షల రూపాయల పరిహారం అందిచటం ఒక ప్రతిపాదన. దీనికి 48 కుటుంబాలు అంగీకరించి ఆ మేరకు పరిహారం స్వీకరిస్తున్నాయి. ఇక రెండవ ప్రతిపాదనకు అంగీకరించిన 94 కుంటుంబాలకు అవే 15 లక్షల పరిహారంలో భాగంగా ఒక ఇల్లు నిర్మాణంతో పాటు సాగు భూమిని కూడా ప్రభుత్వం సమకూర్చుతోంది. ఈ క్రమంలో ఆయా ప్రజల కోసం కవ్వాల్ కు సమీపంలోనే అటవీ ప్రాంతం బయట కొత్త మద్ది పడగలో అన్ని వసతులతో పునరావాస కాలనీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మొత్తం 12.36 ఎకరాల్లో కాలనీ నిర్మాణం అవుతోంది. ఒక్కో కుటుంబానికి 333 చదరపు గజాల్లో ఇల్లు, 2.81 ఎకరాల సాగుభూమిని అందిస్తున్నారు. కాలనీలో సామాజిక ఏర్పాట్లు, పనుల తీరుగా లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
పనులన్నీ పూర్తి కాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటుచేసి లబ్దిదారులకు అందిస్తామని పిసిసిఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. కాగా పర్యటనలో కవ్వాల్ ఫీల్ డైరెక్టర్ శాంతారామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.