Sunday, November 24, 2024

మహిళలకు వడ్డీలేని రుణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రంలోని మహిళా సంఘాల గ్రూపులకు వడ్డ్డీ లేని రుణాలు అందించి వాటి బలోపేతానికి చర్య లు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం భద్రాచలం ఐటిడిఎ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా విద్య, వైద్యం, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆదివాసి గిరిజనులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, ఉపాధికి బాటలు వేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.

రెసిడెన్షియల్ ఆశ్రమ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేట్టాలని అన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్య, ఎఎన్‌ఎంలు, అంబులెన్స్‌ల సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం రిమోట్ ఏరియా పిహెచ్‌సిలలో సరిపడే సిబ్బంది లేకపోతే స్థానికం గా ఉన్న నిరుద్యోగ గిరిజన యువతీ యువకులను కాంట్రాక్ట్ ప్రాతిపదికపై నియమించి వైద్య సేవలు అందేవిధంగా చూడాలని సూచించారు. 100 పడకల ఆసుపత్రి మొదలుకొని పిహెచ్‌సిలలో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, 24 గంటలు పనిచేసే విధంగా సంబంధిత వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పండ్ల తోటల పెంపకం కోసం ప్రతీ మండలంలో ఫ్రూట్ ప్లాంటేషన్ విరివిగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గిరిజన రైతులకు అధిక శాతం నిధులు కేటాయించి ఆయిల్ పామ్ సాగుకు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పిస్త్తామన్నారు. ఆ దిశగా గిరిజన రైతుల కోసం జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి దృష్టి సారించాలని రైతుల భూ సమస్యలు పరిష్కరించి భూపంపిణీ చేసి వ్యవసాయం అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఇందిర జలప్రభ కార్యక్రమంలో వీరికి సబ్సిడీపై కరెంటు మోటార్లు, భూములను అభివృద్ధి చేశామని, తిరిగి ఈ పథకాన్ని పునఃప్రారంభించడానికి వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లోని రైతులకు పాస్‌బుక్‌ల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు తీర్చడానికి ధరణి కమిటీని వేశామని, కమిటీ ద్వారా రిపోర్టు రాగానే భూ సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు. భద్రాచలంలో గోదావరి కరకట్టను పెంచడానికి కృషి చేస్తామని అన్నారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు ఆటంకం కలిగించకూడదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు సభ్యురాలు కవిత, శాసనసభ్యులు రాందాస్‌నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, జారి ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు ఎంఎల్‌సి తాతా మధు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఓఎస్‌డి డి. కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్‌పి రోహిత్ రాజ్, భద్రాచలం ఎఎస్‌పి పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News