న్యూఢిల్లీ: మరి కొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు అనేక ప్రతిపక్ష పార్టీలు గత ఏడాది చేతులు కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే కాంస్‌త్రో సీట్ల సర్దుబాటుపై కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షలు ఇప్పటి వరకు ఒక అవగాహనకు రాలేకపోయాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేసే విషయమై ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు.
తాజాగా..కాంగ్రెస్ పార్టీకి కూటమిలోని మిత్రపక్షమైన సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్ ప్రదేశ్‌లో తమ మద్దతు కావాలంటే తాము చెప్పిన ప్రతిపాదనకు ఒప్పుకోవలసిందే అంటూ ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవ్ షరతు విధించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలలో కేవలం 15 మాత్రమే కాంగ్రెస్‌కు కేటాయిస్తామంటూ అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి.
ఈ షరతుకు ఒప్పుకుంటేనే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో తాను పాల్గొంటానని ఆయన చెప్పినట్లు వారు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా 52 స్థానాలు మాత్రమే దక్కాయి. వీటిలో ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర్‌ప్రదేశ్‌తోసహా ఇతర హిందీ ప్రాంతాలు అతి స్వల్పంగా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో కేవలం సోనియా గాంధీ పోటీ చేసిన రాయబరేలి మాత్రమే కాంగ్రెస్‌కు దక్కింది. అమేథీలో బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ సైతం ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పట్ల గౌరవార్థం రాయబరేలి, అమేథీ నుంచి ఎస్‌పి పోటీ చేయలేదు. అయితే ఈసారి ఎస్‌పి తన వైఖరి మార్చుకుంది. కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అంతేగాక..ఎస్‌పి పోటీ చేసే స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేయకూడదని కూడా షరతు విధించింది. ఇప్పుడు నిర్ణయం కాంగ్రెస్ చేతిలో ఉంది. ఓంటరిగా పోటీ చేయాలా లేక ఎస్‌పి కేటాయించిన 15 స్థానాలకే పరిమితిమవ్వాలా. తమ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఒప్పుకుంటేనే మంగళవారం రాయబరేలిలో రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ యాదవ్ చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అనేక విడతలుగా చర్చలు జరిపామని, ఎన్నోసార్లు స్థానాలకు సంబంధించిన జాబితాలు మార్చుకున్నామని, ఇక నిర్ణయం కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందని అఖిలేష్ తేల్చి చెప్పినట్లు వర్గాలు చెప్పాయి.
ఇప్పటికే కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగా, పంజాబ్‌లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌తో సీట్ల పొత్తుకు తాము సిద్ధంగా లేమంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. బీహార్‌లో జెడియు అధినేత నితీశ్ కుమార్ నుంచి మొత్తం కూటమికే కోలుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్ కుమార్ ఏకంగా కూటమి నుంచి వైదొలగి బిజెపి పంచన చేరిపోయారు. ఇన్న ఎదురుదెబ్బల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాది పార్టీ షరతులకు లోబడి సీట్ల సర్దుబాటుకు అంగీకరిస్తుందా లేక కూటమి నుంచి వైదొలగి ఎవరి దారిన వారు పోటీ చేస్తారా అన్నది వేది చూడాలి.