భారత్ ఇప్పుడు ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది
భారత్ పునర్నిర్మాణం బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు
సంభాల్‌లో ప్రధాని మోడీ
శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన
సంభాల్ (యుపి) : భారతదేశానికి కాల చక్రం మారిందని, దేశం ఎన్నో రికార్డులు నెలకొల్పుతున్నదని, ప్రపంచానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంభాల్‌లో ఉద్ఘాటించారు. ‘భారత్ అనే ఆలయం’ పునర్నిర్మాణం బాధ్యతను దేవుడు తనకు అప్పగించినట్లు మోడీ చెప్పారు. ఉత్తర ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రఢాని మోడీ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అయోధ్యలో రామ మందిరంలో విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ రోజు జనవరి 22 నుంచి కొత్త కాల చక్రం మొదలైందని తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ‘శ్రీరాముడు పాలించినప్పుడు ఆయన ప్రభావం వేలాది సంవత్సరాలు కొనసాగింది. అదే విధంగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠతో భారత్‌కు రానున్న వెయ్యి సంవత్సరాలకు కొత్త ప్రస్థానం మొదలైంది’ అని మోడీ చెప్పారు.
ఈ కార్యక్రమానికి హాజరైన సాధువులు, మత పీఠాల అధిపతుల ఆశీస్సులను ప్రధాని మోడీ కోరుతూ, “రాష్ట్రీయ రూపీ మందిర్’ (భారత్ అనే ఆలయం) పునర్నిర్మించే కర్తవ్యాన్ని భగవంతులు నాకు ఇచ్చాడు’ అని తెలిపారు. ఒక వైపు యాత్రా స్థలాల అభివృద్ధి జరుగుతుండగా, మరొక వైపు నగరాలు హైటెక్ మౌలిక వసతులు పొందుతున్నాయని ఆయన చెప్పారు. ఆలయాల నిర్మాణం జరుగుతుండగా, దేశ వ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలు నెలకొంటున్నాయని మోడీ తెలియజేశారు. ‘ప్రస్తుతం మన పురాతన శిల్పాలను విదేశాల నుంచి తిరిగి తెస్తున్నాం. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. కాల చక్రం మారిందని, నవ శకారంభం చోటు చేసుకుంటున్నదనేందుకు ఈ మార్పు నిదర్శనం.
అరమరికలు లేకుండా దీనిని మనం స్వాగతించవలసిన తరుణం ఇది’ అని మోడీ అన్నారు. మొట్టమొదటి సారిగా భారత్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నదంటే దేశం ఇతరులను అనుసరించకుండా వాటికి సోదాహరణంగా నిలుస్తున్నదని ప్రధాని చెప్పారు. ‘ప్రప్రథమంగా టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్‌ను అవకాశాల కేంద్రంగా పరిగణిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. దేశాన్ని సృజనాత్మక కేంద్రంగా గుర్తించారని ఆయన చెప్పారు. ‘మనం మొట్టమొదటి సారిగా ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాం’ అని ప్రధాని చెబుతూ, ‘మనం చంద్రుని దక్షిణ ధ్రువాన్ని కూడా చేరాం’ అని తెలిపారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ, ‘సరిగ్గా గత నెలలోనే దేశం 500 ఏళ్ల నిరీక్షణను ముగించింది’ అని చెప్పారు. ‘రామ్ లల్లా దైవిక అనుభవం ఇప్పటికీ మనల్ని భావోద్వేగంతో నిలుపుతున్నది.
కాగా, మన దేశానికి వందలాది కిలో మీటర్ల దూరంలో అరబ్ గడ్డమపై అబూ ధాబిలో తొలి భారీ ఆలయం ప్రారంభోత్సవాన్ని కూడా మనం చూశాం’ అని ఆయన చెప్పారు. ‘ఇదే కాలంలో విశ్వనాథ్ ధామ్ పరిఢవిల్లుతుండడాన్ని కూడా మనం చూశాం. అంతే కాదు. కాశీ పునరుత్థానాన్ని కూడా చూస్తున్నాం. మహాకాల్ మహాలోక్ వైభవాన్ని చూశాం. సోమనాథ్ అభివృద్ధిని, కేదార్ లోయ పునర్నిర్మాణాన్ని చూశాం’ అని మోడీ చెప్పారు. పరాజయంలో కూడా విజయాన్ని సాధించగల దేశం భారత్ అని ప్రధాని పేర్కొన్నారు.
‘మనపై వందలాది సంవత్సరాలు అనేక సార్లు దాడులు జరిగాయి. మరే దేశమైనా, మరే సమాజమైనా, అంతగా కొనసాగిన దాడుల వల్ల పూర్తిగా ధ్వంసమై ఉండేది. అయినా, మనం నిలదొక్కుకోవడమే కాకుండా మరింత దృఢంగా అవతరించాం’ అని మోడీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ వెంట యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కల్కి ధామ్ పీఠాధీశ్వర్, కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ ఉన్నారు.