Monday, December 23, 2024

సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దడం కోసమే శిక్షణ

- Advertisement -
- Advertisement -

శిక్షణకు వెళ్లనున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు
రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి దిశా నిర్దేశం

మన తెలంగాణ, సిటీ బ్యూరో: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సమర్థవంతంగా పనిచేసేందుకు, క్రమశిక్షణ నేర్పేందుకే శిక్షణ ఇవ్వనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. అంబర్ పేట హెడ్ క్వార్టర్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్లనున్న సెలెక్టెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు రాచకొండ పోలీస్ కమిషనర్ దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుల్ శిక్షణకు వెళ్ళడం అనేది జీవితంలో ఒక చక్కటి నూతన దశ అన్నారు. శిక్షణలో భాగంగా వివిధ ప్రాంతాల శిక్షణా కేంద్రాలకు వెళ్ళే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ శిక్షణలో నేర్పించే అంశాలను క్రమశిక్షణతో, అంకిత భావంతో నేర్చుకోవాలని సూచించారు. శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల కాలంలో నేర్చుకోబోయే అంశాలు శిక్షణ అనంతరం ఉద్యోగంలో చేరిన తర్వాత తమ విద్యుక్త బాధ్యతల నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

శిక్షణ కేంద్రంలో పరిచయం అయ్యే కొంతమంది కొత్త మిత్రులతో కలిసి శిక్షణ అనంతరం ఒకే చోట పని చేసే అవకాశం ఉందని, కాబట్టి శిక్షణ కేంద్రం అభ్యర్థులకు కొత్త మిత్రులను కూడా అందిస్తుందని అన్నారు. శిక్షణ కాలంలో నేర్పే అంశాలను శ్రద్ధతో, అంకితభావంతో నేర్చుకోవాలని, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పోలీసు శాఖలో చేరి ప్రజలకి సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఎంతో మంది యువతీ యువకులు అహోరాత్రులు శ్రమించి, ఎంతో కఠిన శ్రమతో శారీరక దారుడ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం ద్వారా తమ కలను సాకారం చేసుకున్నారనిఅన్నారు.

అటువంటి ఉన్నత ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. పోలీసు ఉద్యోగం ద్వారా సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు సత్వర న్యాయం అందించే గొప్ప అవకాశం లభిస్తుందని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసే అవకాశం వస్తుందని అన్నారు. శిక్షణ కేంద్రంలో తమ ప్రతిభా పాటవాల ద్వారా, తమ యొక్క మంచి ప్రవర్తన, క్రమశిక్షణ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ అడిషనల్ డీసీపీ శ్యాంసుందర్, ఏసిపిలు నరేందర్ గౌడ్, ఇమ్మునేల్, సిఏఓ పుష్పరాజ్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News