563 పోస్టులతో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరణ
గతంలో దరఖాస్తు చేసుకున్న ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు: టిఎస్‌పిఎస్సీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్ 563 పోస్టులతో సోమవారం టిఎస్‌పిఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తులు స్వీకరించనుంది. గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్‌ను టిఎస్‌పిఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దయ్యాయి. ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు టిఎస్‌పిఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
షెడ్యూల్ వివరాలు: ఈనెల 23వ తేదీ నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న వాటిని సవరణకు మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు అవకాశం కల్పించింది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ పరీక్ష ఏడు రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభమయ్యే నాలుగు గంట ముందుకు అవకాశం ఇచ్చింది. గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్ష మే కానీ జూన్ నెలలో నిర్వహించనున్నారు. తేదీల వివరాలు అనేది తరువాత ప్రకటిస్తామని టిఎస్‌పిఎస్సీ తెలిపింది. గ్రూప్ మెయిన్ పరీక్ష 2024, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉండనుంది. గతంలో దరఖాస్తు చేసి వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
నిరుద్యోగుల్లో చిగురించిన ఆశలు: కాంగ్రెస్ ప్రభుత్వం పాత గ్రూపు-1 పరీక్ష రద్దు చేసిన అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల రాష్ట్రంలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా గ్రూపు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించకముందే కొంతమంది ప్రభుత్వం పెద్దలు పేపర్ లీకేజి చేసి నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు రాజధాని నగరానికి వచ్చి కోచింగ్ సెంటర్‌లో లక్ష రూపాయలు చెల్లించి శిక్షణ తీసుకుని రాత్రింబళ్లు చదివి పరీక్షలు రాస్తే తీరా సమయానికి లీకేజీ చేయడంతో తమ జీవితాలు బుగ్గిపాలైయ్యాయని మండిపడుతున్నారు. సిఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు తమ ఎంతో సంతోషనిచ్చిందని పేర్కొన్నారు.