మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుపై ఇంత భారీ తేడాతో విజయం సాధించడం అసాధారణ అంశంగానే చెప్పాలి. క్రాలీ, డకెట్, ఓలి పోప్, రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, ఫోక్స్ వంటి ప్రపంచ శ్రేణి బ్యాటర్లు కలిగిన జట్టును భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే పరిమితం చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఖాయమని అందరూ భావించారు.
తొలి టెస్టులో ఎదురైన ఓటమితో భారత్ సిరీస్‌లో పుంజుకోవడం అంత తేలికకాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్ సేన మాత్రం విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో అనూహ్యంగా పుంజుకుంది. రాహుల్, జడేజా, సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే మ్యాచ్ బరిలోకి దిగింది. ఒకవైపు ఓటమితో ఎదురైన ఒత్తిడి మరోవైపు స్టార్ ఆటగాళ్ల సేవలు కోల్పోవడంతో విశాఖలో ఇంగ్లండ్ విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. అయితే టీమిండియా మాత్రం అందరి అంచనాలు తారుమారు చేస్తూ విశాఖలో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్‌ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది.
కీలక ఆటగాళ్లు బ్యాటింగ్‌లో విఫలమైనా యువ సంచలనం యశస్వి జైస్వాల్ చారిత్రక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కళ్లు చెదిరే డబుల్ సెంచరీ సాధించాడు. టీమిండియా సాధించిన 396 స్కోరులో యశస్వి ఒక్కడు చేసిన పరుగులే 209 కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బాగానే ఆడింది. అయితే కీలక సమయంలో భారత స్పీడ్‌స్టర్ బుమ్రా అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ బ్యాటింగ్‌లో తడబడింది. ఈసారి శుభ్‌మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ గట్టిగానే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బుమ్రా మరోసారి అద్భుత బౌలింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. బుమ్రా మూడు వికెట్లు తీశాడు. అశ్విన్ కూడా మూడు వికెట్లను పడగొట్టి తనవంతు సహకారం అందించాడు. ఇంగ్లండ్ టీమ్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ ఒక్కడే రాణించాడు. మిగతావారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. విశాఖలో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 11తో సమం చేసింది.
కోటలో పూర్తి ఆధిపత్యం..
ఇక రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ అసాధారణ ప్రతిభను కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు శతకాలతో అలరించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీలు బాదేశారు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ ఖాన్ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఇక డకెట్ విధ్వంసక శతకం సాధించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరుకే సాధించింది. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీసి ఇంగ్లండ్‌ను ఆశించిన స్కోరు కంటే తక్కువకే పరిమితం చేశారు.
ఇదిలావుంటే రెండో ఇన్నింగ్స్‌లో యువ సంచలనం యశస్వి జైస్వాల్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగి పోయాడు. శుభ్‌మన్ గిల్ కూడా కొద్ది తేడాతో శతకం సాధించే ఛాన్స్‌ను కోల్పోయాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. 41 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా 434 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సాధించి సిరీస్‌లో 21 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.