ముంబై: విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో మరాఠా ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలలోనే బిల్లు ఆమోదం పొందడం విశేషం. సభ్యులంతా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజ్ఞప్తి చేయగా ప్రతిపక్ష సభ్యులతోసహా అందరూ పూర్తి మెజారిటీతో బిల్లును ఆమోదించారు. అయితే అధికార శివసేనకు చెందిన మంత్రి ఛగన్ భుజ్‌బల్ మాత్రమే బిల్లును వ్యతిరేకించారు.
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకుడు విజయ్ బాడెట్టివార్ ఇందుకు అంగీకరించారు. దీంతో బిల్లు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇప్పుడు ఈ బిల్లును ముఖ్యమంత్రి షిండే శాసన మండలిలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు చట్టరూపంలో అమలులోకి వస్తుంది.