Monday, December 23, 2024

అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు:  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

- Advertisement -
- Advertisement -

4.32లక్షల టన్నుల మిర్చి దిగుబడి అంచనా

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టు బాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి కారణంగా రాష్ట్రంలో 75శాతం సాగు విస్తీర్ణము రెండు లేదా మూడు పంటల క్రిందకు వచ్చిందన్నారు.

ఈ పరిస్థితిని నివారించి అన్నీ పంటలకు గిట్టు బాటు ధర వచ్చే విధంగా అవసరమగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించిoదని వెల్లడించారు. ఈ క్రమoలో పసుపు బోర్డు ఏర్పాటు, సిఐఐ సెంటర్ల కొనసాగింపుకు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. ఇప్పుడు మార్కెట్లకు పోటెత్తుతున్న మిర్చి పంట అమ్మకాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కానీ, ధర విషయంలో తేడా కానీ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర స్థాయిలో , జోనల్ స్థాయిలో పనిచేసే సంబంధిత అధికారులను అమ్మకాలు ఎక్కువగా జరిగే మార్కెట్లకు పర్యవేక్షకులుగా నియమించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొనే ఏర్పాట్లు చేయడం జరిగినదని తెలిపారు.

ఈ సీజన్ లో రాష్ట్రంలో 3 లక్షల 91 వేల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ,ఇప్పటికే 94,395.08 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్ కు రావడం జరిగిందని, రానున్న రోజుల్లో 3,37,014 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉన్నదని కావున మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులు , మార్కెట్ కమిటీ కార్యదర్శులు ఎటువంటి నిర్లక్ష్యమునకు తావివ్వకుండా, అమ్మకాలు సజావుగా సాగేంధుకు అన్నీ చర్యలు చేపట్టాలని లేనిచో కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు. అదే విధంగా వేరుశనగ అమ్మకాల్లో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సత్వరము పరిష్కరించి అమ్మకాలు సజావుగా సాగేటటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రంలో ఈ యాసంగి లో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగుకాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగలదని అంచనా వేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా , స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ మరియు ఉద్యానశాఖల నుంచి కూడా అధికారులను సంబంధిత జిల్లా అధికారులు తో మిర్చి , వేరుశనగ అధికముగా పండించే జిల్లాలను సందర్శించి, మార్కెట్లకు ఉత్పత్తులను తీసుకొచ్చే విషయంలో రైతులందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించినట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News