Monday, December 23, 2024

బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్‌లో బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే బండి సంజయ్‌కి బడితపూజ తప్పదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బండి సంజయ్ నోరు జారితే, ఇలాంటివి రిపీట్ అయితే తాము చేతికి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కెసిఆర్ డిల్లీకి వెళ్తారని పత్రికల్లో వార్తలు వస్తే తప్పు పడుతున్న బండి సంజయ్, ఎంపీగా ఆయన, కిషన్ రెడ్డి ఎందుకు డిల్లీ వెళ్తున్నారో సమాధానం చెప్పాలని అడిగారు. బిజెపి గ్రూపు తగాదాలు భరించలేక బండి సంజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన భూతులు మాట్లాడుతూ తన స్థాయిని రోజు రోజుకు దిగజార్చుకుంటున్నారని పేర్కొన్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి, ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని నిలదీశారు. బిజెపితో పొత్తు కావాలని బండి సంజయ్‌ను ఎవరు అడిగారో చెప్పాలని అన్నారు. తెలంగాణకు విభజన హామీలు, నిధులు ఇవ్వడంలో వివక్ష చూపిన బిజెపి ఎన్నటికీ తమకు శత్రువే అని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ సహా ఇతర బిజెపి అభ్యర్థులను బిఆర్‌ఎస్ మట్టుబెట్టిందని అన్నారు. ఓడిపోతామనే భయంతోనే బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేయలేదని విమర్శించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దురహంకారంతో కూడినవనీ, తెలంగాణను సాధించిన కెసిఆర్‌పై ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఓటమి భయంతో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బిజెపిలో జాతీయ స్థాయి పదవి ఉన్నా, బండి సంజయ్ పరిస్థితి గల్లీ లీడర్ కంటే అధ్వాన్నంగా మారిందని, అందుకే ఉనికి చాటుకునేందుకు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News