Friday, November 15, 2024

బిజెపికి చెంపపెట్టు

- Advertisement -
- Advertisement -

దేశంలోని విపక్షాలను వెంటాడి వేధిస్తున్న బిజెపికి సుప్రీం కోర్టు చెంప చెళ్ళుమనిపించే సంచలన తీర్పు ఇచ్చింది. ఇది న్యాయ, కార్యనిర్వాహక శాఖల చరిత్రలోనే అసాధారణమైనదని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలనే కాకుండా స్థానిక సంస్థలను కూడా వదలకుండా బిజెపి అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకునే అక్రమ ప్రక్రియకు సుప్రీం కోర్టు తన తీర్పుతో ‘చెక్’ పెట్టింది. చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో మెజారిటీని తలకిందులు చేసి అధికారాన్ని కైవసం చేసుకొన్న బిజెపి అడ్డదారిని ఆధారాలతో సహా అత్యున్నత న్యాయస్థానం రుజువు చేసి ఆప్ కౌన్సిలర్‌ను మేయర్‌గా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడామని సగర్వంగా ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం అందించిన శుభవార్త ఇది. చండీగఢ్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికకు సంబంధించి నెలకొన్న వివాదంపై సుప్రీం కోర్టు మంగళవారం ఈ సంచలన తీర్పు వెలువరించింది.

మేయర్ ఎన్నికలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను విజేతగా ప్రకటించింది. సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఆప్‌కు నైతిక విజయం లభించగా, ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి షాక్ తగిలింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం ఆప్, బిజెపి మధ్య తీవ్ర రాజకీయ, న్యాయ వివాదానికి దారి తీసింది. జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో తగినంత సంఖ్యా బలం (16) లేకపోయినా బిజెపి మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి కావలసిన కౌన్సిలర్ల బలం (20) ఉన్నప్పటికీ కాంగ్రెస్ మద్దతు కూడా ఉన్న ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పరాజయం పొందారు. ఆ ఫలితంపై ఆప్‌తో పాటు కాంగ్రెస్ వెంటనే విమర్శనాస్త్రాలు సంధించాయి. ఎన్నికల అధికారి బ్యాలట్ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి, వాటిలో కొన్నిటిని చెల్లకుండా చేశారని అవి ఆరోపించాయి.

కానీ మేయర్ ఎన్నిక ఫలితంలో తప్పు ఏమీ జరగలేదని బిజెపి వాదించింది. ఆప్ కౌన్సిలర్లు వేసిన ఎనిమిది బ్యాలట్ పత్రాలను సరైన కారణం లేకుండా ‘చెల్లుబాటు కానివిగా’ ప్రకటించిన అనంతరం బిజెపి అభ్యర్థి మనోజ్ సోంకర్ నాలుగు ఓట్ల తేడాతో మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆప్ కౌన్సిలర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికలో అక్రమాలు జరిగాయనే ఆరోపణతో దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ వ్యవహరించిన తీరును బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వివాదం తమ వద్దకు విచారణకు రాగా మేయర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారి చర్య వల్ల చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలట్ పత్రాలను మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టుకు సమర్పించాలని సిజెఐ డివై చంద్రచూడ్ సోమవారం సాయంత్రం ఆదేశించారు.

తదనుగుణంగా మంగళవారం ఉదయం బెంచ్‌కు ఆ బ్యాలట్ పత్రాలు అందజేశారు. రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలట్ పత్రాలను బెంచ్ పరిశీలించింది. ‘ఈ బ్యాలట్ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా’ అని మసీహ్‌ను బెంచ్ ప్రశ్నించింది. ‘అవి ఆప్ అభ్యర్థి పేరిట వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు’ అని సిజెఐ వెల్లడించడమే కాకుండా వాటిని కోర్టులో రెండు పక్షాల న్యాయవాదులకు చూపించారు. అదే విధంగా వోట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వీడియోను మరొకసారి వీక్షించారు. తదనంతరం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News