హీరోయిన్ త్రిషపై అసభ్య కామెంట్లు చేసిన అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజుపై తమిళ చిత్ర పరిశ్రమ భగ్గుమంటోంది. ఆమెకు మద్దతుగా పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. గతంలో త్రిషపై అసభ్యకరమైన కామెంట్లు చేసి, అందరిచేతా చీవాట్లు తిన్న నటుడు మన్సూర్ అలీఖాన్ తాజా వివాదంలో త్రిషకు అండగా నిలబడటం విశేషం.
త్రిషకు గతంలో కొందరు రాజకీయ నాయకులు 25 లక్షలు ఇచ్చి, ఒక రిసార్టుకు పిలిపించుకున్నారని ఏవీ రాజు వ్యాఖ్యానించడంతో తమిళనాట రచ్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యల తాలుకు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల క్రితం హీరోయిన్ త్రిషపై సహ నటుడు మన్సూర్ అలీఖాన్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అలీఖాన్ పై మెగాస్టార్ చిరంజీవితో సహా అనేకమంది మండిపడ్డారు. ఈ వివాదం సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో అన్నాడీఎంకే నేత రాజు చేసిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాన్ని రగిలించాయి. దీనిపై త్రిష మండిపడుతూ ‘నలుగురి దృష్టిలో పడేందుకు ఇంత చీప్ గా ఎలా దిగజారుతారోన’ని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వాళ్ళపై న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు.
త్రిషపై ఏవీ రాజు చేసిన అసభ్యవ్యాఖ్యలు తనను కలచివేశాయని కేరక్టర్ నటుడు మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సహించరానివనీ, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి హీరో విశాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ వెధవ మా సినీ సోదరుల గురించి అసహ్యంగా మాట్లాడినట్లు నా దృష్టికి వచ్చింది. మీరు పబ్లిసిటీ కోసమే ఇలా చేశారని తెలుసు కాబట్టి మీ పేరు ఉచ్చరించడం కూడా నాకిష్టం లేదు. మీరిలాంటి కామెంట్లు చేశాక, మీ కుటుంబంలోని ఆడవాళ్లు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నాను’ అని కామెంట్ చేశాడు.