హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి అభ్యర్థి పేరును టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం కోస్గీలో జరిగిన సభలో సిఎం కీలక ప్రకటన చేశారు. కల్వకుర్తి మాజీ ఎంఎల్‌ఎ వంశీ చంద్ రెడ్డిని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం నారాయణ పేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఇప్పటికే వంశీ చంద్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్ ఎంపి టికెట్ ఆయనకే ఫిక్స్ అని వార్తలు వినిపించగా, సిఎం రేవంత్ రెడి బుధవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.