Thursday, December 19, 2024

వారంలో రెండు పథకాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / మహబూబ్ నగ్ బ్యూరో / కోస్గి / నారాయణపేట : వారం రోజుల్లో మరో ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లుగా మరో రెండు కొత్త పథకాలు అమల్లోకి తీసురాబోతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ సౌక ర్యం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మార్చి 15న రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. రూ 2 లక్షల రైతు రుణమాఫీని కూడా త్వరలో  పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో రేవంత్ పర్యటించారు. రూ.4369కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రజలకు ఓట్లు అడగాలన్నారు.

‘ఎక్కడి నుండో వలస వచ్చిన నిన్ను పాలమూరు ప్రజలు ఎంపిగా గెలిపిస్తే తెలంగాణ తెచ్చిన అని చెప్పిన నీవు పాలమూరు ప్రజలకు ఏమి చేశావు’ అని కెసిఆర్‌ను నిలదీశారు. పదేళ్ల కాలంలో పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశావా అని ప్రశ్నించారు. పాలమూరురంగారెడ్డితో పాటు కల్వకుర్తి,నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పూర్తిగా నిర్లక్షం వహించారని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టిన కెసిఆర్ పాలమూరు జిల్లాలో ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఘాటుగా విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జలదోపిడి కంటే ముఖ్యమంత్రిగా కెసిఆర్ అయిన తర్వాతనే తెలంగాణ జల దోపిడీకి గురైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జల దోపిడీ చేయాలంటే అప్పటి ముఖ్యమంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేసేవారన్నారు. కెసిఆర్ ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్‌తో కుమ్మకై రోజుకు 12 టిఎంసిల నీటిని రాయలసీమ తరలించేలా ఒప్పందం చేసుకున్నాడని ఘాటుగా ఆరోపించారు.

ఆంధ్ర సిఎం జగన్‌ను ఇంటికి పిలిచి భోజనాలు వడ్డించి 210 జిఒ ద్వారా తెలంగాణ జలాలను రాయలసీమ తరలించేలా కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మా కాంగ్రెస్ అధినేత చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్లు అందులో దూరి కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేశారని విమర్శించారు. అల్లుడేమో నల్గొండ నుండి.. కొడుకేమో పాలమూరు నుండి పాదయాత్రలు చేస్తామంటూ ముందుకు వస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని ప్రజలను కోరారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికీ లంబాడీ మహిళలు పుణె, ముంబయి వంటి నగరాలకు వలసలు వెళ్తూనే ఉన్నారని అన్నారు.

మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకుంటా..
‘జడ్‌పిటిగా, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎగా, ఎంపిగా, ముఖ్యమంత్రిగా తనను మీరు ఆశీర్వదించారు. ఎక్కడో నల్లమలలో మారుమూల పల్లెలో రైతుబిడ్డగా ఉన్న నన్ను మీ గుండెల్లో పెట్టుకుని చూసుకుని ముఖ్యమంత్రిని చేశారు. మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకుంటాను’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్ ప్రజల ఆశలను, ఆశయాలను నెరవేరుస్తానని భరోసా కల్పించారు. ఎప్పుడో పురుడుపోసుకున్న నారాయణపేటకొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 10ఏళ్లు పాలించినా ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు. మీ ప్రాంత బిడ్డగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని హామీ ఇచ్చినట్టుగానే నెరవేరుస్తున్నందున సంతోషంగా ఉందన్నారు. నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

బిజెపి, బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం ..
రాష్ట్రంలో బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. 2014లో పాలమూరు సభలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తానని మాట ఇచ్చి, తప్పారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ పాలమూరు ప్రాజెక్టుపై ఎలాంటి హామీ పొందలేకపోయారని విమర్శించారు. బిజెపి నేతలు కిషన్ రెడ్డి, డికె అరుణ జితేందర్ రెడ్డి జాతీయ హోదాపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రైల్వే ప్రాజెక్టులో మట్టి తీయలేదని జాతీయ రహదారి నత్తనకడన నడుస్తున్నాయని, నేవీ ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ఈ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్, రాజనర్సింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్, వికారాబాద్, మక్తల్ , మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట, తాండూర్ ఎంఎల్‌ఎలు రాంమోహన్ రెడ్డి, శ్రీహరి, యెన్నం శ్రీనివాస రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, ఫర్ణిక రెడ్డి, మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News