Friday, November 22, 2024

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ‘ఆప్’ దూరం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ విజయానికి సంపూర్ణ సహకారం
స్థానిక సంస్థలపైనే ఆమ్ ఆద్మీ పార్టీ గురి

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీకీ దూరంగా ఉండబోతోంది. మిత్ర పక్షమైన కాంగ్రెస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకుంది. పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు ఖరారయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో మాత్రం పోటీకి పార్టీ అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో పార్టీ రాష్ట్ర శాఖ పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్ తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఆప్ పోటీకి దూరంగా ఉంది. కాగా రాష్ట్రంలో పార్టీని కింది స్థాయి నుండి పటిష్టం చేయడంపై ఆ పార్టీ దృష్టి సారించింది. కింది స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయడం ద్వారా వచ్చే స్తానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు ప్రత్యక్షంగా పాల్గొన బోతున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ 21 జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుంది. 96 నియోజకవర్గాల్లో ఆప్ కన్వీనర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను చేపట్టింది. క్రియాశీల, సాధారణ సభ్యత్వాలను కొనసాగిస్తున్నట్లు ఆప్ నేతలు వెల్లడించారు. క్రియాశీల సభ్యత్వానికి ప్రతి నెలా రూ.100 నుండి రూ.3000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులు నేరుగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కమిటీ ఖాతాలోకి వెళుతాయి. పార్టీ కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారని ఆప్ నేతలు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో 33 జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడం వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆప్ రాష్ట్ర శాఖ సన్నాహాలు చేస్తోంది. తద్వారా 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని ఆప్ నేతలు వెల్లడించారు. పార్టీ అధిష్టానం తెలంగాణ పార్టీ ఇంచార్జిగా ఇటీవల ఢిల్లీ ఎంఎల్‌ఎ దిలీప్ పాండేను నియమించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా ఆయన రాష్ట్ర వ్యవహారాలపై సమీక్ష నిర్వహించనున్న్రారు. అందుకోసం ఆప్ రాష్ట్ర నేతలు సమాయత్తమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News