Monday, December 23, 2024

సిఎం రేవంత్‌ రెడ్డి విజన్ 2050 బాగుంది

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ప్రకటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు

వికారాబాద్‌ను రోల్‌మోడల్‌గా, జహీరాబాద్ దగ్గర 12 వేల ఎకరాల్లో ఫార్మాక్లస్టర్‌ల
ఏర్పాటుపై సిఎం ప్రకటన హర్షణీయం

నగరం నలువైపులా అభివృద్ధి చేయాలన్నదే సిఎం రేవంత్ నిర్ణయం
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి.రాజశేఖర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి విజన్ బాగుందని, రానున్న రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రియల్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి.రాజశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బి.జగన్నాథ రావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 2050 విజన్‌లో ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలో మరింత అభివృద్ధి జరుగుతుందని, రియల్ రంగం అభివృద్ధికి ఇప్పటికే సిఎం రేవంత్ కూడా అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. వికారాబాద్‌ను రోల్‌మోడల్‌గా, జహీరాబాద్ దగ్గర 12 వేల ఎకరాల్లో ఫార్మాక్లస్టర్‌లను ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ ప్రకటించారని దీంతో ఆయా ప్రాంతాల్లో రియల్‌రంగానికి ఊపు తెచ్చిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల అనేక పెద్ద సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, సిఎం రేవంత్ ప్రకటనతో ఈ పెట్టుబడులు మరింత పెరుగుతాయన్నారు. నగరం నలువైపులా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమన్నారు.
ఫైర్ సర్వీస్ హెడ్‌క్వార్టర్స్‌కు రూ17 కోట్లు
దీంతోపాటు హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల మాస్టర్‌ప్లాన్‌లను రాబోయే తరాలకు అనుగుణంగా రూపొందిస్తామని సిఎం పేర్కొనడం ఆయన ముందుచూపుకు నిదర్శమన్నారు. ఫైర్ సర్వీస్ హెడ్‌క్వార్టర్స్ (కమాండ్ కంట్రోల్ కార్యాలయం) నిర్మాణం కోసం క్రెడాయ్ సభ్యులందరూ భాగస్వాములై సుమారుగా రూ.17 కోట్లతో ఆ భవనాన్ని నిర్మించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ భవన నిర్మాణం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఫైర్ సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే అప్రమత్తమయ్యే అవకాశం ఉందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో భాగంగా క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకురావడంతో ఆయా ప్రాంతాల్లో ఐటీ కార్యాలయాలు, వారి నివాస సముదాయాలు, వారికి కావాల్సిన సకల సౌకర్యాలను సమకూర్చుకోవచ్చని దీనివల్ల వర్క్ ఫ్రం హోం కాకుండా వాక్ టు ఆఫీస్ అనే విధంగా తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు. ఓఆర్‌ఆర్ అనుసంధానంగా 14 రేడియల్ రోడ్లు ఇప్పటికే ఉన్నాయని, ఆర్‌ఆర్‌ఆర్ కూడా అందుబాటులోకి వాహనదారులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు.
వచ్చేనెల 8,9,10వ తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
వచ్చేనెల 8,9,10వ తేదీల్లో హైటెక్స్ 13 ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీ షో జరుగుతుందని ఆయన తెలిపారు. ఇది సింగిల్ ప్లాట్‌ఫాం అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ షోలో రెరా అనుమతులు ఉన్న ప్రాజెక్టులనే ఇక్కడ ప్రదర్శించేలా బిల్డర్స్‌కు సూచనలు చేశామన్నారు. దీంతోపాటు పెద్ద బ్యాంకులు వెంటనే లోన్‌లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గత మూడు నెలలుగా హెచ్‌ఎండిఏ, రెరా అనుమతుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన నేపథ్యంలో అలాంటివి సహజమని, ఇప్పటికే ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లామని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మాములుగా ఆరు నెలలు మాత్రమే రియల్‌రంగం బాగా ఉంటుందని, మిగతా రోజుల్లో శుభ ముహూర్తాలు ఉండవని, అందుకే రియల్‌రంగం స్తబ్ధుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News