Saturday, November 23, 2024

కొలువుదీరిన తల్లులు

- Advertisement -
- Advertisement -

వరాల తల్లి సమ్మక్క ఆగమనం

రాత్రి 9.20 నిమిషాలకు గద్దెపైకి చేరిన సమ్మక్క
భక్తి పారవశ్యంతో ఓలలాడిన మేడారం

ఉద్వేగభరిత వాతావరణంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క
కాల్పులు జరిపి తల్లిని ఆహ్వానించిన జిల్లా ఎస్‌పి శబరీష్

స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ శ్రీజా

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ఎప్పుడెప్పు డా అని ఎదురుచూసిన అపురూప ఘట్టం రానే వచ్చింది. కోట్లాది మంది కోరిన కోర్కెలు తీర్చే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలపై చేరే అద్భుత ఘట్టం గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుండి సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్‌కుమార్ సాయంత్రం 6: 51 నిమిషాలకు సమ్మక్క తల్లిని కిందికి తీసుకుని వచ్చారు. ముందుగా సాయంత్రం నాలుగు గంటలకు చిలకల గుట్టకు గిరిజన పూజారులతో కలిసి చేరుకున్న పూజారు లు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తల్లిని తోడ్కొని వచ్చారు. సమ్మక్క తల్లి పూజారులు తల్లి తీసుకుని వస్తున్న క్రమంలో గిరిజన సంప్రదాయాల ప్రకారం ముందుగా చలపలయ్యను బలిచ్చి, అనంతరం మేకపోతును బలివ్వడంతో గిరిజనులు బూర శబ్ధాలు, డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క తల్లి వడివడిగా గుట్ట దిగివచ్చింది. తల్లి ఆగమనానికి గుర్తుగా జిల్లా ఎస్‌పి శబరీష్ గురువారం సాయంత్రం 6: 51 నిమిషాలకు ఎకె 47 తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి తల్లి చిలకలగ్టుపై నుంచి దిగి వస్తుందన్న సమాచారాన్ని భక్తులకు తెలియజేశారు.

ఆ క్షణం సమ్మక్క తల్లి ఆగమనాన్ని కళ్లారా చూడాలని భక్తులు అడవిలోని ప్రతీ చెట్టు ఎక్కి ఆ అద్బుతమైన, ఉద్వేగ భరితమైన దృశ్యాన్ని తిలకించారు. తల్లి దిగివస్తున్న సందర్భంగా భక్తులు జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లి అనే నినాదాలతో చిలకలగుట్ట ప్రాంగణమంతా దద్దరిల్లింది. తల్లి దిగివస్తుండగా మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ శ్రీజా సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. సమ్మక్క తల్లిని పూజారులు చిలకలగుట్ట నుండి వడివడిగా కిందికి తీసుకువచ్చారు. అక్కడి నుండి గద్దెల వైపు వెళుతున్న సందర్బంగా భక్తులు సమ్మక్కతల్లి రాకను స్వాగతిస్తూ రోడ్డు వెంట రంగు రంగుల రంగవల్లులతో అలంకరించారు. తాము వేసిన ముగ్గులపై నుంచి తల్లి నడిచి వెళితే కోరుకున్న కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకంతో ముగ్గులు వేశారు. తల్లి వస్తున్న సమయంలో కోళ్ళు , మేకలను భక్తులు ఎదురుగా గురవేసి బలిచ్చారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో చిలకలగుట్ట ప్రాంతానికి వెళ్ళే రహదారి కిక్కిరిసిపోయింది. శివసత్తులు అమ్మవారి రాక సందర్బంగా చీర, సారెలు, పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియ్యంతో అమ్మవారిని పోలిన అలంకరణలతో ఎదురేగి శివాలు ఊగుతుండగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకొంది.

పోలీసులు, రోప్ పార్టీల నడుమ సమ్మక్క తల్లి భారీ బందోబస్తుతో గురువారం రాత్రి లక్షలాది మంది భక్తులు వీక్షిస్తుండగా గద్దెలపైకి చేరింది. రెండేళ్లుగా తల్లుల దర్శనం కోసం పడిగాపులు కాసిన భక్తుల నిరీక్షణకు సమ్మక్క సారలమ్మ తల్లులు దర్శనం ఇచ్చి వారిని ఆదరించారు. మేడారం గద్దెల ప్రాంగణానికి సమ్మక్క తల్లి చేరుకున్న సందర్భంగా గద్దెల ప్రాంగణమతా ఉద్వేగభరిత వాతావరణంలో భక్తులు శివాలు ఊగారు. గద్దెల వద్దకు చేరుకున్న సమ్మక్క తల్లి ముందుగా తన ముద్దుల కుమారుడు జంపన్న, కుమార్తె సారలమ్మ, భర్త పగిడద్దరాజు, గోవిందరాజులను పలకరించింది. పున్నమి వెన్నెల నడుమ చల్లని తల్లి సమ్మక్కను గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ అపురూప దృశ్యాలను తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. తల్లి ఆగమనాన్ని తెలుసుకున్న భక్తులు, జంపన్న వాగులో పవిత్ర స్నానాలు చేసి నేరుగా క్యూలైన్లకు చేరుకుని సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించకొని కోళ్ళు, మేకలను వేలాదిగా బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

దీంతో మేడారం మహాజాతర అంకమ దశకు చేరుకుంది. సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లి ఆగమనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్‌పి శబరీష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సమ్మక్క సారలమ్మలు గద్దెలపై చేరడంతో కనులవిందుగా వీక్షించి భక్తులు మొక్కులు చెల్లించుకుకోనున్నారు. శుక్రవారం, శనివారం సాయంత్రం వరకు గద్దెలపై ఉండే సమ్మక్క సారలమ్మ శనివారం సాయంత్రం తిరిగి వన ప్రవేశం చేయనున్నారు.

Medaram 2

Medaram 3

Shiva Sattulu

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News