Tuesday, November 5, 2024

గురుకులాల భవనాలకు రూ. 2500 కోట్లు

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ పాఠశాలలకు దీటుగా సమీకృత గురుకుల పాఠశాలలు
పైలెట్ ప్రాజెక్టుగా మధిర నియోజకవర్గం ఎంపిక
నియోజకవర్గాల వారీగా నాలెడ్జి కేంద్రాలు

ఉన్నత విద్యాశాఖ సమీక్షలో డిప్యూటీ సిఎం భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యా శాఖ అధికారులను అదేశించారు. గురువారం డా. బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణాలకు గాను బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడ జరిగినందున భవన నిర్మాణాల పనులు త్వరితగతిన ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక ముందు నిర్మించే భవనాలు ఒక చోట ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు ఇంటిగ్రేటేడ్‌గా ఒకే చోట నిర్మాణం చేయడంతో స్థల సమస్యను అదిగమించొచ్చని సూచించారు. అదే విధంగా కామన్ అందేటి సౌకర్యాలతో కూడ కొంత అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు ఒకే చోట ఉండటంతో విద్యార్థుల్లో సోదర భావాన్ని పెంపొందించడంతో కుల రహిత సమాజానికి బాటలు వేసిన వారమవుతామన్నారు. అలాగే మిని ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయడానికి బాగుంటుందని వివరించారు. ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం మదిర నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. ఎస్సీ, బిసి, ,మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు. ఎస్సీ, బిసి, మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఎర్రుపాలెం మండల పరిధిలో నిర్మాణం చేయడానికి స్థల ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం బెంగళూర్కు చెందిన ఆర్కిటెక్ ప్రతినిధులు దేశంలో వివిద ప్రాంతాల్లో వారు చేపట్టిన ఇంటర్ నేషనల్ మోడల్ పాఠశాలలకు సంబందించిన పవర్ పాయింట్ ప్రజేటింషన్ను విద్యాశాఖ అధికారుల సమశ్యంలో డిప్యూటి సీఎం తిలకించారు. అన్ని హంగులతో అత్యుత్తమ ప్రమాణాలతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు ఒకే మోడల్ గా చేపట్టాడానికి తగిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నాలేడ్జ్ కేంద్రాలను నియోజకవర్గ కేంద్రాల వారీగా ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటి సీఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News