చలో ఢిల్లీ ఆందోళనలో పాల్గొంటూ కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబానికి పంజాబ్ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. దివంగత రైతు సోదరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
భటిండాకు చెందిన శుభ్ కరణ్ సింగ్ అనే 21 ఏళ్ల రైతు పంజాబ్-హర్యానా సరిహద్దులో కనౌరీ వద్ద చలో ఢిల్లీ ఆందోళనలో పాల్గొంటూ, బుధవారం కాల్పుల్లో కన్నుమూశాడు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 12మంది పోలీసులు గాయపడ్డారు. రోడ్డుపై పెట్టిన బారికేడ్లవైపు రైతులు దూసుకువెళ్తుండగా, వారిని పోలీసులు నిలువరించే సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసు కాల్పుల్లోనే శుభకరణ్ మృతి చెందాడన్నది రైతుల వాదన.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శుక్రవారం మాట్లాడుతూ రైతు కుటుంబానికి కోటి పరిహారం, అతని చెల్లెలికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.