చండీగఢ్: యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ మరణానికి బాధ్యులైన వారిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసే వరకు అతని మృతదేహానికి అంత్యక్రియలు జరగవని శుక్రవారం రైతు నాయకులు ప్రకటించారు. హర్యానా పోలీసులు, పంజాబ్ రైతులకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో 21 ఏళ్ల యువ రైతు శుభ్‌కరణ సింగ్ మరణించాడు. శుభ్‌కరణ్ సింగ్ కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం, అతని సోదరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రైతు నాయకులు ఈ డిమాండ్ చేశారు. ఘర్షణలో శుభ్‌కరణ్ తలకు బలమైన గాయం ఏర్పడిందని పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని రైతు నాయకులు పట్టుపట్టడంతో శుభ్‌కరణ్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించడంలో జాప్యం జరిగింది. శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటించారని రైతు నాయకుడు శర్వన్ సింగ్ పంధెర్ శుక్రవారం పాటియాలాలో విలేకరులకు తెలిపారు.
కాని ఇది సాధ్యం కాదని అధికారులు ఇప్పుడు చెబుతున్నారని ఆయన చెప్పారు. రెండు రోజులైనా పది రోజులైనా ఫర్వాలేదు..బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవరకు అంత్యక్రియలు జరిగే ప్రసక్తి లేదని శుభ్‌కరణ్ తల్లిదండ్రులకు కూడా చెప్పామని ఆయన తెలిపారు. తమకు డబ్బు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. హర్యానా భద్రతా సిబ్బందిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేయలేదని బటిండ సీనియర్ ఎస్‌పి తమకు చెప్పారని సంయుక్త కిసాన్ మోర్చ(రాజకీయేతర) నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ విలేకరులకు తెలిపారు. కేసు మోదు చేయలేని పక్షంలో సంజాబ్ రక్షకులు ఎలా అవుతారని ఆయన పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము కేసు నమోదు చేస్తే హర్యానా భద్రతా సిబ్బంది కూడా తమపై కేసు నమోదు చేస్తారని ఆ పోలీసు అధికారి చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ ఆందోళనలో మరణించిన ఒక యువకుడికి న్యాయం జరగాలన్నదే తమ ప్రధాన డిమాండని ఆయన చెప్పారు. ఇక నిర్ణయం తీసుకోవలసింది పంజాబ్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు.
పోలీసు అధికారికి గాయాలు
హర్యానాలోని హిసర్ జిల్లా ఖేడీ చౌపటాలో శుక్రవారం నిరసన చేస్తున్న రైతులతో జరిగిన ఘర్షణలో ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. శరిస్త్రాణాలు ధరించిన పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకుంటుండగా వారిపైకి రైతులు తిరగబడి ఘర్షణకు తెగబడ్డారు. రైతులపైకి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతోపాటు లాఠీ చార్జీ చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పంజాబ్‌లోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న వేలాది మంది పంజాబ్ రైతులను కలుసుకోవడానికి బయల్దేరిని రైతులను అడ్డుకోవడానికి హర్యానా పోలీసులు ప్రయత్నించిన సందర్భంగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది.