మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందని ఆపార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపి డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు పార్టీలకు అతీతంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరు పార్టీలకు ఓటేసినప్పటికీ ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోదీ కోసం మేమున్నామంటూ కదులుతున్నారని, రాష్ట్రంలో అత్యధిక ఎంపి స్థానాలు బిజెపికే వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. యాత్ర సాగుతున్న ప్రతి పల్లెలోని ప్రజలు దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసిన మోదీకే మా మద్దతని స్పష్టంగా చెబుతున్నారన్నారు. విజయ సంకల్పయాత్ర పొడుగునా తెలంగాణ ప్రజలు ‘‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’’ అంటూ ఫిర్ ఏక్ బార్ అంటే మోడీ సర్కార్ అంటు బదులిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. నాలుగు క్లస్టర్లలలో ఆరు పార్లమెంట్ల పరిధిలో 45శాసనసభ నియోజకవర్గాలలో యాత్ర సాగిందని వివరించారు.
మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మోడీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ విజయ సంకల్ప యాత్ర దోహదపడుందని ఆశాభావం వక్తం చేశారు. బాల రాముడి విగ్రహ ప్రతిష్టలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనకపోవడంతో గ్రామాల్లోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధానమంత్రిగా, 140కోట్ల ప్రజల ప్రతినిధిగా నిష్టతో నరేంద్ర మోడీ పూజలో పాల్గొంటే ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల మోడీ పాలనలో అభివృద్ధి కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులిస్తున్నట్లు సర్పంచులు కూడా చెప్పడం మోడీ పాలనకు గీటురాయి వంటిదన్నారు.
బిఆర్‌ఎస్, బిజెపి పొత్తు పెట్టుకుంటున్నాయని పనిలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయించడంపై మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలానే ప్రజలను దృష్టి మళ్లించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, విజయ సంకల్ప యాత్రలో ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఆటలు సాగబోవన్నారు.
పదేండ్ల మోడీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుండి గట్టెక్కారని ప్రధాని విజయాలను ఏకరువు పెట్టారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి, కుంభకోణాలు, వంశపారపర్య రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలకు పాల్పడడం తప్ప వేరే ఏం లేదని తీవ్రంగా దుయ్యబట్టారు. గ్యారంటీలను అమలు చేయడం చేతకాని రేవంత్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తినే ఆరు గ్యారెంటీలు అమలుకు సాధ్యమవుతుందని అనడం దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.