చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్‌ను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా తలపై బాది హతమార్చారు. చేవెళ్ల సీఐ లక్ష్మా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామానికి చెందిన వర్థ హర్యా(40) రెండేళ్లుగా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులను నిర్వహిస్తున్నాడు. కాగా రోజువారి దిన చర్యలో భాగంగా గురువారం రాత్రి కూడా మృతుడు వర్థ హర్యా విధులను నిర్వహించేందుకు వచ్చాడు. కాగా అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు కార్యాలయంలోకి వచ్చి విధులను నిర్వహిస్తున్న వర్థ హర్యాపై దాడి చేశారు.
తలపై గట్టిగా కొట్టడంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దుండగులు మృతుని వద్ద ఉన్న ఫోన్‌తో పాటు విద్యుత్ సబ్ స్టేషన్‌లోని ఫోన్‌ను కూడా తీసుకెళ్లారు. తెల్లవారుజామున స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న చేవెళ్ల పోలీసులు అక్కడికి చేరుకుని పంచానా మా నిర్వహించారు. ఆలూరు గ్రామంలో ఫాస్ట్‌పుడ్‌లో పనిచేసే బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. పాత కక్ష్యాల లేకా.. డబ్బులు, ఫోన్‌ల కోసమే హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. మరొక వ్యక్తి పరారిలో ఉన్నట్లు చెప్పారు. పరారిలో ఉన్న వ్యక్తి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. పంచానామా నిర్వహించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.