Friday, December 20, 2024

వెంటాడిన మృత్యువు

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ లాస్య నందిత మృతి

మన తెలంగాణ/హైదరాబాద్/పటాన్‌చెరు : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు లాస్య నందితను పటాన్ చెరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే లాస్య నందిత మృతి చెందినట్టుగా ప్రకటించారు. లాస్య నందిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఆమె పిఎ ఆకాశ్‌గా పోలీసులు గుర్తించారు. ఆకాశ్ కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి 11 గంటల సమయంలో లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో సదాశివపేట మండలం ఆరూర్‌లోని మిస్కిన్ షా బాబా దర్గాను సందర్శించారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్నానంతరం శుక్రవారం ఉదయం లాస్య నందిత అల్పాహారం తినాలంటూ షామీర్ పేట వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి, సంగారెడ్డి వైపు కారుత లో వస్తుండగా తెల్లవారు జామున సుమారుగా 5.10 గంటల సమయంలో సుల్తాన్‌పూర్ టోల్ ప్లాజా దాటిన తర్వాత లాస్య నందిత పిఎ, కారు నడుపుతున్న ఆకాశ్ ఆకస్మాత్తుగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఎడమవైపు ఉన్న ఓఆర్‌ఆర్ మెట్‌బీమ్‌కు బలంగా ఢీకొనడంతో ఎంఎల్‌ఎ అక్కడికక్కడే మృతి చెందారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆకాశ్‌ను వెంటనే మదీనాగూడలోని శ్రీకర ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఎంఎల్‌ఎ లాస్య నందిత మృత దేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫొరెన్సిక్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్‌పి రూపేష్ వెల్లడించారు.
అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం
మరోవైపు, అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఎఎస్‌పి సంజీవ్‌రావు వెల్లడించారు. ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి ఓఆర్‌ఆర్ పక్కన రెయిలింగ్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లాస్య నందిత ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో లాస్య పిఎ, డ్రైవర్ అయిన ఆకాశ్ కాళ్లు విరిగిపోయాయని ఎఎస్‌పి వెల్లడించారు.
పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు
మరోవైపు తలకు బలమైన గాయాలు కావడం వల్లే లాస్య నందిత మృతి చెందినట్టుగా పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక చెబుతోంది. అతి వేగంగా రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో లాస్యనందితకు బలమైన గాయాలై మృతి చెందినట్టుగా పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం తెలుస్తుంది. తైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. కాలు పూర్తిగా విరిగిపోయిందని రిపోర్టు వెల్లడించింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఆమె మృతికి కారణమైందనే అభిప్రాయాన్ని పోస్టు మార్టం నివేదిక చెబుతోంది.
ఆకాశ్ పై కేసు నమోదు
ఎంఎల్‌ఎ లాస్య నందిత పిఎ ఆకాశ్‌పై 304ఎ ఐపిసి సెక్షన్ల కింద పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాశ్ నిర్లక్ష్యంగా కారు నడపటం వల్లనే తన సోదరి మరణించిందని నివేదిత ఇచ్చిన ఫిరా్యుద మేరకు కేసు నమోదు చేశారు. అతి వేగంగా , నిర్లక్ష్యంగా కారు నడిపారని ఆకాశ్‌పై కేసు నమోదు చేశారు.
ప్రమాదంపై అనుమానాలెన్నో…!?
కారు వేగంగా వెళ్తుండటంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రెయిలింగ్‌ను ఢీ కొట్టినట్లు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే కచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా, ఎడమవైపు ఉన్న ముందు చక్రం సైతం ధ్వంసమైంది. మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. నందిత కారు బ్యానెట్ పై భాగంలో అంటుకొని ఉన్న రెడీ మిక్స్ సిమెంట్ క్లూస్‌ను కూడా పోలీసులు సేకరించారు. మరీ ముఖ్యంగా.. ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే లాస్య నందిత మృతితో కార్ల రక్షణపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు పెట్టి కొన్న కార్లు చిన్న చిన్న ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన నెటిజన్లు వెలిబుచ్చుతున్నారు.
అచ్చిరాని ఫిబ్రవరి
తండ్రి మరణించిన ఏడాదికే కూతురు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 2023 ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న అనా రోగ్యంతో మరణించారు. సాయన్న మృతి చెంది ఏడాది దాటింది. నాలుగు రోజుల క్రితమే సాయన్న మృతి చెంది ఏడాది దాటింది. తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి చెందారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫిబ్రవరి మాసంలో ఈ కుటుంబం లో వరుస సంఘటనలు జరగడంతో ఫిబ్రవరి నెల అచ్చిరాలేదని సాయన్న అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
రెండు ప్రమాదాలు తప్పినా మూడోసారి వెంటాడిన మృత్యువు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లాస్య నందితను ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు వెంటాడాయి. 2 ప్రమాదాల్లో ఆమె బయటపడినా మూడోసారి ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఎంఎల్‌ఎగా ఎన్నికైన అనంతరం 2023, డిసెంబర్ 24న బోయినపల్లి వద్ద ఆమె లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. అక్కడ వీఆర్ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్ట్‌లో కిందకు దిగుతుం డగా అందులో చిక్కుకున్నారు. చాలామంది లిఫ్ట్ లోకి వెళ్లడంతో కొద్దిసేపటికి డోర్ తెరుచుకోలేదు. దీంతో లాస్య నందితతో పాటు పలువురు అందులోనే చిక్కుకుని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్ డోర్ బద్దలుకొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీసు కొచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి13న నల్లగొండలో బిఆర్‌ఎస్ నిర్వహిం చిన బహిరంగ సభలో లాస్య నందిత పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎంఎల్‌ఎ తలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా, మరో హోంగార్డుకు గాయాలయ్యాయి. ప్రమా ద సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె సోదరి, ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసు కున్న లాస్య నందిత తన సోదరితో కలిసి మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు. నల్లగొండ ప్రమాదం జరిగిన 10 రోజుల తర్వాత శుక్రవారం లాస్య నందితను మరో కారు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది.
లాస్య నందిత ప్రస్థానం…
దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. 1987లో హైదరాబాద్ లో ఆమె జన్మించారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య ఆ ఏడాది కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో తండ్రి సాయన్నతో పాటు బిఆర్‌ఎస్‌లో చేరారు. 2016 నుంచి 20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పని చేశారు. 2021 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది, ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి సాయన్న మృతి చెందారు. అనంతరం ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టిగా ప్రయత్నించినా, మాజీ సిఎం కెసిఆర్ సాయన్న కుమార్తె నందితపైనే నమ్మకం ఉంచారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె బిఆర్‌ఎస్ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తె మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం
అలుముకుంది.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. ఈస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికలో ఆమెకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్మశానవాటికకు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.

అంతకుముందు సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు. లాస్య అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మె ల్యే లాస్య మరణం వార్త తెలిసినప్పటి నుంచి హరీశ్ రావుతోపాటు ఇతర నేతలు అన్నీ దగ్గరుండి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News