సిటిబ్యూరోః లోన్ యాప్‌లో రుణం తీసుకుని అప్పుల్లో కూరుకుపోయిన యువకుడు స్నేహితులతో కలిసి రాబరీ చేశాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 34గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి డిసిపి పద్మజా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంఘారెడ్డి జిల్లా, లింగంపల్లి, రామచంద్రాపురం, శ్రీకృష్ణ రెసిడెన్సీకి చెందిన దాసరి సాత్విక్ వ్యాపారం చేస్తున్నాడు, మేనేని అనిల్ కుమార్ క్యాటరింగ్, ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. సిరిసిల్లా జిల్లాకు చెందిన గడ్డె సాయి కుమార్ అలియాస్ కుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సాత్విక్ లోన్ యాప్‌లో రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చే దారికన్పించకపోవడంతో తన బంధుల ఇంట్లో రాబరీ చేయాలని ప్లాన్ వేశాడు.
ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. ఉప్పల్‌లో ఉంటున్న తమ బంధువు నూతలపాటి రామాదేవి(62) తన భర్తతో కలిసి ఉంటోంది. ఫంక్షన్లలో తరచూ ఆమె బంగారాన్ని వేసుకుని రావడం చూశాడు. ఎలాగైనా ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 19వ తేదీన సాత్విక్ కారును అద్దెకు తీసుకుని రమాదేవి ఇంటికి ముగ్గురు కలిసి వెళ్లారు. సాత్విక్ కింద ఉండి ఇంటిని చూపించాడు. అనిల్‌కుమార్, సాయి కుమార్ బాధితురాలి ఇంటికి వెళ్లి మీకు డబుల్ బెడ్ రూమ్ మంజూరైందని చెప్పాడు. తాము డబుల్ బెడ్ రూమ్ ఆఫీస్ ఉద్యోగులమని, తమతో వస్తే ఇంటికి సంబంధించిన పత్రాలు అందజేస్తామని చెప్పారు. తనకు నిజంగానే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరైందని భావించిన బాధితురాలు వారి వెంట వెళ్లింది. రమాదేవిని నిందితులు కారులో ఉప్పల్ భగాయత్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి మెడపై కత్తిని పెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం దోచుకున్నారు.
తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులు కారులో పరారయ్యాడరు. అక్కడి నుంచి వచ్చి బాధితురాలు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్లు ఎలక్షన్ రెడ్డి, మన్మద్ కుమార్, డిఎస్సై కోటేశ్వర్‌రావు తదితరులు దర్యాప్తు చేశారు.