Monday, December 23, 2024

ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

ముంబై: బరోడాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 140.4 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన బరోడా ఆట రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్షు మోలియా (1) విఫలమయ్యాడు. మరో ఓపెనర్ జ్యోత్స్‌నిల్ సింగ్ 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన శశ్వత్ రావత్, కెప్టెన్ విష్ణు సోలంకి జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రావత్ 9 ఫోర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. సోలంకి 2 ఫోర్లతో అజేయంగా 23 పరుగులు చేయాలి.

బరోడా ప్రత్యర్థి టీమ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే మరో 257 పరుగులు చేయాలి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ముంబైను యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో ఆదుకున్నాడు. ఒంటరి పోరాటం చేసిన బషీర్ 357 బంతుల్లో 18 ఫోర్లతో 203 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్ (57), శార్దూల్ ఠాకూర్ (17) మాత్రమే రాణించారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ ఏడు, నినంద్ రత్వా మూడు వికెట్లను పడగొట్టారు.

ఆంధ్రా 172 ఆలౌట్..
ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రా టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఆంధ్రాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ మూడేసి వికెట్లను పడగొట్టారు. అవేశ్ ఖాన్, కుల్వంత్‌లు చెరో రెండు వికెట్లను తీశారు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఎంపి టీమ్ 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
తమిళనాడుకు ఆధిక్యం..
సౌరాష్ట్రతో కోయంబత్తూర్ వేదికగా జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. సాయి కిశోర్ ఐదు, అజిత్ రామ్ మూడు వికెట్లు తీసి సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన తమిళనాడు శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కెప్టెన్ సాయి కిషోర్ (60), ఓపెనర్ జగదీశన్ (37) పరుగులు చేశారు. బాబా ఇంద్రజీత్ (80), భూపతి కుమార్ (65) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో తమిళనాడు ఇప్పటికే 117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఇక కర్ణాటకతో నాగ్‌పూర్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో విదర్భ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కర్ణాటక శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News