లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తర ప్రదేశ మొరాదాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో యాత్ర చివరి ఘట్టంలో తన సోదరునితో కలిశారు. ఆమె రాహుల్‌తో కలసి అమ్రోహా, సంభల్, బులంద్‌శహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా యాత్రలో పాల్గొంటారని, ఆదివారం ఫతేపూర్ సిక్రీలో యుపి ఘట్టం యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ తెలియజేసింది. యాత్ర మొరాదాబాద్‌లో వివిధ ప్రాంతాల మీదుగా సాగినప్పుడు జనం ‘రాహుల్ గాంధీ జిందాబాద్’, ‘ప్రియాంక గాంధీ జిందాబాద్’, ‘కాంగ్రెస్ పార్టీ జిందాబాద్’ వంటి నినాదాలు చేశారు. కాగా, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో యాత్రలో కలుస్తారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో సీట్ల పంపకంపై కాంగ్రెస్,
ఎస్‌పి ఒక ఒప్పందానికి వచ్చిన తరువాత అఖిలేశ్ యాత్రలో పాల్గొనబోతున్నారు. ‘రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర మొరాదాబాద్ నుంచి తిరిగి మొదలైంది. రాహుల్ గాంధీ వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. యాత్ర మొరాదాబాద్ మీదుగా సాగుతుండగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉభయులూ ఓపెన్ జీపులో కూర్చున్నారు’ అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ హింద్వి తెలియజేశారు. యాత్ర ఆదివారం రాజస్థాన్ ధోల్‌పూర్‌లో ఆగుతుంది. రాహుల్ గాంధీ ముందుగా నిర్ణయమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా యాత్రకు సోమవారం (26) నుంచి మార్చి 1 వరకు విరామ దినాలుగా ప్రకటించినట్లు కాంగ్రెస్ తెలిపింది. యాత్ర మళ్లీ మార్చి 2న ధోల్‌పూర్ నుంచి తిరిగి మొదలవుతుంది.