Sunday, November 24, 2024

సైన్యం పెత్తనానికి చుక్కెదురు?

- Advertisement -
- Advertisement -

బ్రిటిష్ పాలకులు కుతంత్రంగా జరిపిన దేశ విభజన అనంతరం భారత దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ పుష్కలమైన ఆర్థిక వనరులతో సంపన్న దేశంగా ఉండెడిది. అయితే, పలు కారణాల చేత సుపరిపాలన లోపించడంతో, పాలనా యంత్రాంగంపై సైనిక నాయకత్వం ఆధిపత్యం కొనసాగుతూ ఉండడంతో స్వతంత్రించి దేశాభివృద్ధి లక్ష్యంగా పని చేసే ప్రభుత్వాలు మనుగడ సాగించలేకపోయాయి. తరచుగా సైనిక తిరుగుబాటు, ఎన్నికలు జరిగినా సైన్యం చెప్పుచేతలలో ఉండేవారే ఎన్నికవుతూ ఉండటం, సైనిక నాయకత్వం తీవ్రమైన అవినీతితో ఉండడంతో దేశం ఆర్థికంగా ఛిన్నాభిన్నం కావడం జరుగుతూ వచ్చింది. మొదటి నుంచి ప్రభుత్వంపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం భారత్‌ను ఒక బూచిగా చూపుతూ, తాము లేకపోతే భారత్ దురాక్రమణ చేస్తుందనే భయం సృష్టించే ప్రయత్నం సైనిక నాయకత్వం చేస్తూ వచ్చింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగడం ద్వారా భారత్‌తో సాధారణ సంబంధాలకు అవకాశం లేకుండా సైనిక ఉద్రిక్తలకు దోహదపడుతూ వచ్చారు. బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ వంటి కొందరు ప్రధానులు భారత్‌తో మంచి సంబంధాలకు చొరవ తీసుకున్నప్పటికీ వారిని అర్ధాంతరంగా గద్దె దింపారు.

చివరకు ప్రధాన మంత్రి ప్రమేయం లేకుండా సైన్యాధిపతిగా ముషారఫ్ కార్గిల్ దురాక్రమణకు సాహసించడం తెలిసిందే. సైన్యపు నిర్వాకం ఫలితంగా నేడు పాకిస్తాన్ ఒక ‘రోగ్’ దేశంగా, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రమాదకర దేశంగా, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశంగా అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలయింది. నిత్యావసర వస్తువులు గగనమై, అప్పిచ్చేవారే లేక దేశం అలమటిస్తున్న సమయంలో ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో సైన్యం బలపరిచిన పార్టీలు, నేతలకు ఆ దేశ ప్రజలు ఓ విధమైన గుణపాఠం నేర్పారు. గత ఎన్నికల్లో సైనిక మద్దతుతోనే ప్రధాన మంత్రి పదవి చేపట్టి, ఆ తర్వాత సైన్యంతో పొసగక పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో ఉంచినా, ఆయన పార్టీకి గుర్తింపు లేకుండా చేసినా, పెద్ద ఎత్తున రిగ్గింగుకు పాల్పడినా 101 మందిని స్వతంత్ర అభ్యర్థులుగానే గెలిపించి ప్రజాస్వామ్యం పట్ల ఆ దేశ ప్రజలు తమ స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సుమారు రెండు వారాల పాటు తర్జనభర్జనలు పడిన తర్వాత చివరకు సంకీర్ణ ప్రభుత్వానికి మార్గం ఏర్పడింది. రాజకీయ విద్వేషాలను పక్కన పెట్టి అధికారం కోసం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పిఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

కేవలం తమకు ఎదురు తిరిగిన ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయంగా అంతం చేయడం కోసమే విదేశాలలో ఆశ్రయం పొందుతున్న నవాజ్ షరీఫ్‌ను దేశంలోకి రప్పించి, ఆయనపై ఉన్న కేసులను కొట్టి వేయించి, ఎన్నికల్లో పోటీపై ఉన్న ఆంక్షలను రద్దు చేయించి సైన్యం ఎంతగా మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా మద్దతు లభించలేదు. అనూహ్యమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ లో ఇప్పుడు ఎవరు ప్రధాని పదవి చేపట్టినా రాజకీయాలలో సైనిక జోక్యాన్ని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారని ఫలితాలు వెల్లడి చేశాయి. గతంలో పలు పర్యాయాలు సైనిక తిరుగుబాటుతో సైన్యాధిపతులే దేశనాయకత్వం బాధ్యతలు చేపట్టారు. లేదా తమకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరిచారు. అయితే రాజకీయాలలో సైన్యపు ప్రత్యక్ష జోక్యం కారణంగా పాకిస్తాన్ అభివృద్ధిలో అధ్వానస్థితికి చేరుకొన్న వాస్తవాన్ని ఆ దేశ ప్రజలు ఇప్పుడు గ్రహించారు. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆంతరంగిక భద్రత అంశాలను ఎవ్వరు ప్రభుత్వంలో ఉన్నా సైనిక కనుసన్నలలో నిర్వహిస్తూ ఉండడం ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నట్లు స్పష్టమైనది. అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్ఠ ఎన్నడూ లేనంతగా దిగజారింది. చివరకు అరబ్ దేశాలలో సహితం పాకిస్తాన్ పలుకుబడి సన్నగిల్లుతున్నది.

పాకిస్థాన్‌లో ఏ ప్రధాన మంత్రి కూడా ఐదేళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేయలేకపోవడానికి సైన్యం జోక్యమే కారణం అని చెప్పవచ్చు. 1958లో పాకిస్తాన్ తన మొదటి సైనిక తిరుగుబాటును చూసింది. జనరల్ అయూబ్ ఖాన్ ప్రెసిడెంట్ ఇస్కాందర్ మీర్జా నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు, తరువాతి అతనిని ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా నియమించాడు. అయూబ్ ఖాన్ మార్షల్‌లా విధించి 1969 వరకు దేశాన్ని పాలించాడు. 1971లో భారత్‌పై జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత, జుల్ఫికర్ అలీ భుట్టో 1970లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడయ్యాడు. మూడు సంవత్సరాల తర్వాత ప్రధాన మంత్రి అయ్యాడు. జుల్ఫికర్ 1977లో ఎన్నికలలో మళ్లీ గెలిచాడు. కానీ అదే సంవత్సరంలో జనరల్ జియా-ఉల్-హక్ చేత పదవీచ్యుతుడయ్యాడు. జియా మార్షల్‌లా విధించారు. జాతీయ, అన్ని ప్రొవిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేశారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశారు. జుల్ఫికర్‌ను జైలులో ఉంచి, ఉరి తీశారు. 1988లో విమాన ప్రమాదంలో జియా మరణించిన తర్వాత, బెనజీర్ భుట్టో ఆధ్వర్యంలో పిపిపి తిరిగి అధికారంలోకి వచ్చింది.

1999 వరకు పిఎంఎల్-ఎన్ , పిపిపిల మధ్య అధికార పోరు కనిపించింది. వీరిలో ఎవరూ పదవీకాలం పూర్తి చేయలేదు. 1999లో రక్తరహిత తిరుగుబాటులో నవాజ్ షరీఫ్‌ను జనరల్ పర్వేజ్ ముషారఫ్ తొలగించి బహిష్కరించారు. తదుపరి తిరుగుబాట్లు లేనప్పటికీ పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వాలను పరోక్షంగా పర్యవేక్షించడంపై దృష్టి సారించింది. సైనిక ప్రాయోజిత ప్రభుత్వాన్ని సృష్టించే ప్రయత్నంలో ముషారఫ్ పిఎంఎల్-ఎన్, పిపిపిలను నిషేధించారు. పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీలు సైన్యపు ఆధిపత్య ధోరణి పట్ల అసహనంతో ఉంటూ ఉన్నప్పటికీ బలహీనమైన ఆర్థిక పరిస్థితి, ఏకాభిప్రాయం లేకపోవడం కారణంగా సైనిక ప్రయత్నాలను నిరోధించలేకపోతూ వస్తున్నారు. 2018 లో క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ పిఎంఎల్-ఎన్, పిపిపిలను రెండింటినీ సైన్యం మద్దతుతో ఓడించి చరిత్ర సృష్టించారు. చిన్న పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఖైబర్ పఖ్తుంక్వా, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆ తర్వాత ఇమ్రాన్ పాలనతో సైన్యం విసుగు చెందటం,లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అర్జున్‌ను ఐఎస్‌ఐ చీఫ్ గా నియమించాలని ఇమ్రాన్ కోరినప్పుడు సైన్యంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఉండాలని భావించిన లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను తదుపరి ఐఎస్‌ఐ డిజిగా చేయడాన్ని ఖాన్ ప్రతిఘటించారు. ఆర్మీ చీఫ్ మునీర్‌ను ఐఎస్‌ఐ డిజిగా కూడా ఇమ్రాన్ తొలగించారు. మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాతో ఇమ్రాన్ సమస్యాత్మక సంబంధం పూర్తి శత్రుత్వానికి దారితీసింది.ఉక్రెయిన్ యుద్ధం వంటి విదేశాంగవిధానాలలో సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ వ్యవహరించారు. దానితో చివరికి 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను తొలగించారు. అప్పటి నుండి ఇమ్రాన్‌ను ఓ ‘శత్రువు’గా సైన్యం చూడటం ప్రారంభమైంది. అరెస్ట్‌అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో చిరకాలం ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీలుకలిసి ఏర్పరచే సంకీర్ణం సుస్థిరత ప్రశ్నార్ధకమని చెప్పవచ్చు. అయితే, పొరుగు దేశంలో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం, అస్థిరమైన సంకీర్ణం అధికారంలో ఉండటం అంటే పరోక్షంగా సైనిక పాలన ఉన్నట్లే భారత్ భావించాల్సి వస్తుంది. దానితో భారత్ భద్రతా పరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News